జగన్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం … అమిత్ షా

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ బలోపేతం కావడానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో అధికారమలో ఉన్న వైసిపి ప్రభుత్వం అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం జరపాలని స్పష్టం చేశారు. వైసిపి, టిడిపిలకు సమదూరం పాటిస్తూ, సొంతంగా పార్టీని అభివృద్ధి చేసుకోవడం పట్ల దృష్టి సారించాలని హితవు చెప్పారు.
తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన రాష్ట్ర పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అంతరాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది. వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర పార్టీ తగు స్థాయిలో పోరాటం చేయలేక పోతున్నట్లు ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు.
ఏపీలో బీజేపీ అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని చెబుతూ, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. వైసిపి, టిడిపి – రెండు అవినీతి పార్టీలే అని, వాటితో పొత్తుల గురించి సమయం వృద్ధ చేసుకోవద్దని సంకేతం ఇచ్చారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే దిశగా పార్టీ పనిచేయాలని స్పష్టం చేశారు. 
 
‘జగన్‌ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో బీజేపీ ప్రజలవాణి కావాలి. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలి. పార్టీని బలోపేతం చేసి.. అధికారం దిశగా అడుగులు వేయాలి’ అని స్పష్టమైన మార్గనిర్ధేశం చేశారు. 
 
అదే విధంగా అమరావతినే  రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేసిన రాష్ట్ర బిజెపి, ఇప్పుడు అక్కడ రాజధానికోసం రైతులు జరుపుతున్న పోరాటాలలో ఎందుకు పాల్గొనడం లేదని ఆయన వాకబు చేసిన్నట్లు కూడా తెలుస్తున్నది. ప్రస్తుతం రైతులు చేపట్టిన `న్యాయస్థానం నుండి దేవస్థానం’ వరకు మహా పాదయాత్రలో బిజెపి నాయకులు పాల్గొని, వారికి సంఘీభావం తెలపాలని కూడా సూచించినట్లు తెలుస్తున్నది. 
 
‘మనం ప్రజలకు అనుకూలంగా ఉండాలి.. రాజధాని రైతుల పాదయాత్రకు పల్లెల్లో పూలు జల్లి హారతులిస్తున్నారు.. దేవాలయానికి వెళ్లే మహిళా రైతులకు మనం మద్దతివ్వకపోవడం పెద్ద పొరపాటు. ఆ ఉద్యమానికి టీడీపీ మద్దతుందని మనం దూరం చేసుకుంటే నష్టపోయేది ఎవరు..?’ అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. 
 
మనం ప్రజలకు మద్దతిస్తున్నాం. ఇంకో పార్టీకి కాదు. మీరు దూసుకెళ్లలేక ఇంకొకరిని అంటే లాభం లేదని కూడా హితవు చెప్పారు. పైగా, టీడీపీ ఇప్పటికే ఓడిపోయిందని, దానిపై పడడం కాదని.. వైసీపీ ప్రభుత్వంతో తలపడాలని చెప్పారు. పార్టీ జాతీయ నేతలు బీఎల్‌ సంతోష్‌, పురందేశ్వరి, సత్యకుమార్‌, శివప్రకాశ్‌, రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, సహఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
 
అమిత్‌షాతో భేటీ తర్వాత సమావేశం వివరాలను పురందేశ్వరి మీడియాకు వెల్లడిస్తూ కేంద్ర హోంమంత్రి దిశానిర్దేశం మేరకు రాష్ట్రప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడుతూ ప్రజల గొంతుకగా వ్యవహరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజావిద్రోహ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారు తగిన విధంగా తీర్పునిస్తారని ఆమె స్పష్టం చేశారు. 
 
విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించగా.. ఇప్పటికే కేంద్రం చాలాచేసిందని, ఎవరూ ఊహించని విధంగా కేంద్ర విద్యాసంస్థలన్నింటినీ రాష్ట్రానికి ఇచ్చారని ఆమె తెలిపారు. అయితే ఆందోళన ఉన్న రెండు, మూడు విషయాలపై కూడా షా సానుకూలంగా స్పందించి తమకు హామీ ఇచ్చారని ఆమె వెల్లడించారు.