అనాదిగా వంచనకు గురవుతున్నది గిరిజనులే

భారత దేశంలో అనాదిగా ఎక్కువగా వంచనకు గురి అవుతున్నవారు గిరిజనులు మాత్రమే అని మాజీ మహారాష్ట్ర గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు తెలిపారు.  ఆదిలాబాద్  జిల్లా కేస్లాపూర్, నాగోబా మందిర ప్రాంగణంలో జరిగిన  జనజాతి గౌరవ్ దివస్ సందర్భంగా జరిగిన సమ్మేళన్ లో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  ప్రభుత్వాలు ఎన్ని సౌకర్యవంతమైన చట్టాలు తెచ్చినా వీరికి అందడంలేదని విచారం వ్యక్తం చేశారు. 
ముఖ్యంగా గ్రామసభ ద్వారా సమస్యలు పరిష్కరించుకునే పీసా చట్టం ఉన్నా అది యింకా అమలు కావడం లేదని తెలిపారు. గిరిజనుల హక్కుగల భూములు ఎక్కువగా గిరిజనేతరుల చేతుల్లో ఉన్నాయని పేర్కొంటూ అటవీచట్టం సవరించి అటవీ ఉత్పత్తుల హక్కుదారులుగా ఆదివాసులు ఉండే విధంగా ప్రయత్నం జరగాలని సూచించారు. 
 
అసలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏయే సౌకర్యాలు గిరిజనులకు ప్రత్యేకంగా కలిగించాయో ప్రతి పంచాయతీ కేంద్రంలో బోర్డు పై వ్రాసి ఉంచాల్సిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. తాను మహారాష్ట్ర గవర్నర్ గా ఉండగా గ్రామసభలో ప్రత్యక్షంగా పాల్గొని వారికీ దిశానిర్దేశం  చేసిన్నట్లు గుర్తు చేశారు.  ముఖ్యమైన గిరిజన సమస్యలను సరిచేయడానికి ప్రభుత్వాన్ని ఒప్పించామని చెప్పారు.  
 
ఈ సమ్మేళనంలో  8 మండలాలలోని 134గ్రామాల నుండి 5,123 మంది గిరిజనులు పాల్గొన్నారు.   గిరిజన స్వాభిమాన దినం పేర గిరిజనుల్లో యింకా చైతన్యం  తీసుకు రావలసిన అవసరం ఉన్నదని విద్యాసాగరరావు తెలిపారు. భగవాన్ బిరసాముండా, కొమురం భీమ్, రాంజీ గోండ్ లాంటివారు జీవితాలను ఆదర్శంగా తీసుకొని గిరిజనులు చైతన్యంగా ఉంటూ ప్రగతి చెందాలని సూచించారు. దేశ ప్రగతిలో వారి  భాగస్వామ్యం కీలకమైనదని పేర్కొన్నారు.  

 ఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర గిరిజన కమీషన్ సభ్యులు  అనంతనాయక్ మాట్లాడుతూ భగవాన్ బిరసా ముండా 100సం.ల క్రితమే విదేశీ మిషనరీల దురాగతాలను ఎదుర్కొని, గిరిజనులకు చదువు, వైద్యం అందిస్తూ వారిలోని మూఢాచారాలను తొలగించి భగవాన్ గా పూజించబడినల్టు తెలిపారు. 

ఆ రోజుల్లో గిరిజనులు చనిపోతే ఆభరణాలతో సహా అంత్యేష్టి చేస్తుంటే బిర్సా ఆ సొమ్ములను తెచ్చి బీదలకు పంచేవాడని చెప్పారు. బిరసాయియత్ పేర పసుపు వస్త్రాలు ధరించి, పసుపు జెండాను ఉపయోగించి మాదిరమాంసాలను, ఇతర  దురాచారాలను రూపు మాపి ఎన్నో సంస్కరణలు తెచ్చి ఆదివాసులకు క్రొత్త మార్గాన్ని  చూపారని పేర్కొన్నారు. 

 బిరసా జన్మదినం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం జనజాతి గౌరవ దివస్ గా ప్రకటించి ఈ సందర్బంగా అనేక ఇతర జనజాతి సామాజిక సంస్కర్తలను, స్వతంత్ర యోధులను స్మరించుకొని యావత్తు దేశంలో వారం రోజులు సంస్మరణ కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడం  చాలా అభినందనీయమని ఆయన కొనియాడారు.  

వానవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత అధికారి కొరిగింజ రామచంద్రయ్య మాట్లాడుతూ గిరిజనులు విదేశీపాలనను ఎన్నడూ స్వీకరించలేదని స్పష్టం చేశారు. 1857 కంటే ముందు నుంచే విదేశీ బ్రిటిష్ పాలకులు, క్రైస్తవ మిషనరీల దూరాగతాలకు వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారని నివాళులు అర్పించారు.

భగవాన్ బిరసావలే కొమురం భీమ్, కొమురం సక్కు, రాంజీ గోండ్, ఆంధ్రలో అల్లూరి సహచరులు గంటందొర, మల్లుదొర, మర్రి కామయ్య, మధ్యభారత్ లో రాణి దుర్గావతి, కేరళ తలక్కల్ చందు, కర్ణాటక వెంకటప్పయ్య నాయక్, ఒరిస్సా చక్ర బిసోయి, బీహార్లో తిలకా మాజీ,మహారాష్ట్ర షెడకే మామ, నాగారాణి రాణిమా గైడిన్లు మొదలగు యోధులు స్వతంత్ర పోరాటంలోనూ, సామాజిక చైతన్యం తేవడంలోనూ అగ్రగాములుగా నిలిచారని వివరించారు. 

ఈ గిరిజనవీరుల చరిత్ర భావి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నదని రామచంద్రయ్య చెప్పారు.  భగవాన్ బిర్సా ముండా బాల్యం నుండే నాయకత్వ లక్షణాలతో ఉండి బ్రిటిష్ నాయకత్వాన్ని సవాలు చేసి నిలిచాడని తెలిపారు. సాయుధ పోరాటంలో అగ్రగామిగాగం వల్ల పరమపదించాడని తెలిపారు. 

 ప్రజలను 11 సూత్రాలను పాటించాలని ప్రభోడించాడని చెబుతూ  . బిరసా మరణానంతరం గిరిజనుల ఒత్తిడి కారణంగా  బ్రిటిష్ ప్రభుత ఎన్నో గిరిజన హక్కుల సంస్కరణలు తెచ్చి కలెక్టర్ ల ద్వారా అమలు పరిచారని పేర్కొన్నారు. నేడు వనవాసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు విదేశీశక్తులు, దేశ ద్రోహుల వల్ల సాగుతున్నాయని హెచ్చరించారు. గిరిజనులు ఇతర భారతవాసులందరిదీ ఒకటే రక్తం, అందరూ  భరతమాత బిడ్డలే అని ఆయన స్పష్టం చేశారు.