ఆరు రోజుల పాటు రాత్రిపూట రైల్వే రిజర్వేషన్ బంద్

ప్రయాణికుల సేవలను కరోనా ముందు నాటి సాధరణ స్థితికి తీసుకు వచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా వారం రోజులపాటు రాత్రి వేళ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను మూసివేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి ఈ నెల 21 వరకు రాత్రి 23.30 గంటల నుంచి మరునాడు ఉదయం 5.30 గంటల మధ్య ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పనిచేయదని పేర్కొంది.

ఈ ఆరు గంటల (రాత్రి 23:30 నుంచి ఉదయం 05:30 వరకు) వ్యవధిలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌కు సంబంధించి.. టికెట్ రిజర్వేషన్, కరెంట్ బుకింగ్, టికెట్‌ రద్దు, వీటికి సంబంధించిన విచారణ వంటి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే  పి ఆర్ ఎస్  సేవలు మినహా ఇతర అన్ని విచారణ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించింది. 

రైల్వే డేటా అప్‌డేట్‌ చేస్తుండడంతో సేవలకు అంతరాయం కలుగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. గతేడాది కరోనా  మహమ్మారి నేపథ్యంలో రైలు సర్వీసులను రద్దు చేయగా.. ఆ తర్వాత దశలవారీగా ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రత్యేక రైళ్లను రద్దు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రైళ్ల నంబర్‌కు ముందు ఉన్న ‘0’ను తొలగించి కరోనాకు ముందు ఉన్న చార్జీలు, టైమ్‌టేబుల్‌ ప్రకారం రైల్వే సేవలను అందుబాటులోకి తేనున్నది. ఈ క్రమంలోనే రైల్వే సర్వర్లను అప్‌డేట్‌ చేస్తున్నారు. 

టికెటింగ్‌ సేవలపై ప్రభావం లేకుండా రాత్రి వేళల్లో రిజర్వేషన్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నది. టికెట్‌ రిజర్వేషన్‌, రైలు నంబర్లలో మార్పులను గమనించి సహకరించాలని కోరింది. ప్రయాణికులు విచారణ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌ల వద్ద సమాచారం తెలుసుకోవచ్చని, ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నది.