అక్రమ ఆర్ధిక లావాదేవీలకు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కేంద్రంగా మారుతున్నది. నలువైపులనుంచి విమర్శలు వచ్చి పడుతున్నా మన దేశంలో క్రిప్టో కరెన్సీ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెడుతున్న వారు మన దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.
ఇంటర్నెట్ ద్వారా జరిగే ఈ వ్యవహారంలో ఎవరి జోక్యం లేకుండా పోయింది. క్రిప్టోలో పెట్టుబడులు మంచిది కాదనే ప్రచారం జరుగుతున్నా క్రిప్టో వ్యాప్తి ఆగడం లేదు. దీంతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులపై ఎలా వ్యవహరించాలి, ఇందులో పెట్టుబడి పెట్టే వారికి ఎలాంటి సలహాలు ఇవ్వాలి అనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
అక్రమార్కులకు మనీలాండరింగ్ మార్గాలుగా, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులుగా క్రిప్టో మార్కెట్లు మారకుండా నిలువరించేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా ఈ సందర్భంగా చర్చించారు. ఇప్పుడిప్పుడే జనాదరణ పొందుతున్న క్రిప్టో కరెన్సీ మార్కెట్ల విషయంలో ప్రగతిశీలమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయాలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
క్రిప్టో కరెన్సీపై ఏదో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవలసిన తప్పనిసరి పరిస్థితి కేంద్రానికి ఏర్పడింది. బిజెపి అధికారంలో ఉన్న కర్నాటకలో బిట్ కాయిన్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేస్తోంది. మరో వైపు ఈవిషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టునూ కోరుతోంది.
ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండడంతో కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సిఎం యెడియూరప్పలతో పాటు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నళినీ కుమార్‌లు అత్యవసర సమావేశం జరిపారు. మార్కెట్లో బిగ్ ప్లేయర్లు, ప్రభుత్వాల జోక్యంలేకుండా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరుగుతాయి. మార్కెట్‌ను ఎవరూ కృత్రిమంగా ప్రభావితం చేయకపోవడం ఇందులో సానుకూల అంశం.
అయితే సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల పెట్టుబడులకు ఎలాంటి రక్షణా ఉండదు. అందుకే చైనా సహా చాలా దేశాలు దీన్ని ప్రోత్సహించడం లేదు, గతంలో సుప్రీంకోర్టు కూడా క్రిప్టోపై నిషేధం విధించింది. అయినా దీనిలో భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది.
More Stories
పిల్లల భవిష్యత్తు కు భరోసాగా “ఎన్పీఎస్ వాత్సల్య” నేడే ప్రారంభం
పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్లు
సవాళ్ల సుడిగుండంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి