స్థానిక సంస్థల వైద్యంకు రూ 8,454 కోట్లు విడుదల 

నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర  ప్రభుత్వాలకు రూ 8,453.92 కోట్ల నిధులు విడుదల చేసింది. స్థానిక సంస్థల పరిధిలో వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి, ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ మొత్తాన్ని వినియోగించుకోవాల‌ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
 ఈ నిధులన్నీ గ్రాంట్‌గా విడుదల అయ్యాయి. మొత్తం 19 రాష్ట్రాల స్థానిక సంస్థలకు వీటిని మంజూరు చేశారు. ఇందులో ఏపీ వాటాగా కింద రూ 488.15 కోట్లు మంజూరు చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వైద్య, ఆరోగ్య రంగానికి ఈ నిధులతో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది.
ఆసుపత్రులు,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు చేయడం, అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు, వాటిని అప్‌గ్రేడ్ చేయడం, రోగులకు కల్పించే సదుపాయాలను మరింత మెరుగుపర్చడం వంటి చర్యల కోసం ఏపీ ప్రభుత్వం ఈ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా.. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఈ గ్రాంట్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మొండి చేయి చూపడం గ‌మ‌నార్హం.
గ్రాంట్ విడుద‌లైన రాష్టాల్లో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, అస్పాం, బిహార్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ణిపూర్‌, మిజోరాం, ఒడిశా, పంజాబ్‌, రాజ‌స్థాన్‌, సిక్కిం, త‌మిళ‌నాడు, ఉత్త‌రాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.