మణిపూర్ లో ఆర్మీ కల్నల్ సహా ఏడుగురు మృతి

 మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. చురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అసోం రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కమాండింగ్ అధికారి విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య అనూజ, కుమారుడు అబీర్, మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. 

కమాండింగ్ అధికారి కల్నల్ విప్లవ్ త్రిపాఠి తన కుటుంబ సభ్యులు, క్విక్ రియాక్షన్ టీమ్‌తో కలిసి కాన్వాయ్‌లో వస్తుండగా ఈ దాడి జరిగింది. మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో ఉదయం 10 గంటలకు జరిగిన ఉగ్రదాడి.. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా అధికారులు వర్ణించారు. దాడి జరిగిన సమయంలో క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు అధికారి కుటుంబ సభ్యులు కాన్వాయ్‌లో ఉన్నారు.

మణిపూర్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నప్పటికీ, ఇంకా ఏ గ్రూపు దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. చురాచంద్‌పూర్‌ జిల్లాలోని ఈ మారుమూల ప్రాంతంలో ఉగ్రదాడిలో పౌరులు మరణించడం ఇదే తొలిసారి. ఈ ప్రదేశం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఉత్తరాన 100 కిమీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న అత్యంత మారుమూల గ్రామం.

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆర్మీ కల్నల్, అతని కుటుంబ సభ్యుల మరణాన్ని ధ్రువీకరించారు. కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. దాడిలో గాయపడ్డ వారిని బెహియాంగ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు తెలుస్తుండగా.. మరో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 

మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు రాష్ట్ర పోలీసులు, పారామిలటరీ సిబ్బంది అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, మిలిటెంట్ దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై మిలిటెంట్ల దాడిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఒక ప్రకటనలో ఖండించారు. ఇది పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. దాడి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దేశం ఐదు మంది వీరసైనికులను కోల్పోయిందని అన్నారు. వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.