పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ కానీ కొందరు పనిగట్టుకొని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. దేశం అంతర్జాతీయంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ ఇలాంటి చర్యలు తగవని ఆమె హితవు పలికారు.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని అంటున్నారని, కానీ అలాచేస్తే ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందని తెలిపారు. ఈ భారీ రెవెన్యూ నష్టాన్ని భరిస్తూనే, చమురు మార్కెటింగ్ కంపెనీలు దిగుమతులను నిలిపివేయకుండా ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిన్నదని, దాని ప్రభావం వల్లే దేశీయంగా ఇంధన ధరల సర్దుబాటు అనివార్యమైందని ఆమె స్పష్టం చేశారు.
కొంతమంది అంతా మునిగిపోతోందనేలా భయాలు సృష్టిస్తున్నారని పేర్కొంటూ ఆమె పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మండిపడ్డారు. ఇటీవల రాహుల్‌గాంధీ దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కోబోతోందని హెచ్చరించారు. పశ్చిమాసియా సంక్షోభం మొదలై మూడు నెలలు కావస్తున్న తరుణంలో ప్రభుత్వం ‘3-ఎఫ్’ (ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం) పై ప్రత్యేక దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
అంతర్జాతీయ ఒత్తిళ్లవల్ల ఎరువుల ధరలు ఊహించని స్థాయికి చేరాయని, బంగారం ధరలు పెరగడం కూడా సవాలుగా మారిందని చెప్పారు. బయటి సంక్షోభాలను తట్టుకునేలా మోదీ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సవాళ్లు అన్నీ అంతర్జాతీయ పరిస్థితులవల్ల వచ్చినవేనని, దేశీయంగా ఆర్థిక పరిస్థితి సానుకూలంగానే ఉందని ఆమె తెలిపారు.
పెరుగుతున్న ముడి చమురు ధరలే కాకుండా, ఎరువుల ధరలు కూడా “ఊహించలేనంత” స్థాయికి చేరుకున్నాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు; అంతేకాకుండా, అధిక బంగారం ధరలు బాహ్య రంగంలో “కొన్ని సవాళ్లను” సృష్టిస్తున్నాయని ఆమె తెలిపారు. ఎంఎస్ఎంఈలకు చెల్లించాల్సిన బకాయిలు ఆలస్యం కావడం వల్ల రూ. 8.1 లక్షల కోట్లు నిలిచిపోయాయని, ఈ సమస్య వారి నిర్వహణ మూలధనం, వృద్ధిపై ప్రభావం చూపుతోందని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఎంఎస్ఎంఈలకు చెల్లింపులు జరపడానికి 45 రోజుల గడువును మించకూడదని ఆమె ప్రభుత్వ రంగ సంస్థలను కోరారు. సామాన్య ప్రజలు సాధిస్తున్న విజయాలను మరిచిపోయి కొందరు కేవలం నెగటివిటీని ప్రచారం చేయడం సరికాదని మంత్రి మండిపడ్డారు. మన దేశం ఇలాంటి భయానక ప్రచారాలను భరించలేదని, మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

More Stories
మేలో 9.68 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం
ట్రంప్ ప్రకటనతో తగ్గిన చమురు ధరలు… స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు
భారత్ విజయాలను `తక్కువ చేసి’ చూపే రాహుల్ ప్రయత్నం