అయోధ్య రామమందిర విరాళాల సేకరణలో జరిగినట్లు ఆరోపించిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నసిట్, తన తుది నివేదికలో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని ఈ పరిణామాలపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి. హోం శాఖ ఈ నివేదికను పరిశీలించి, తదుపరి చర్యల కోసం ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు అందజేసింది.
విషయం తెలిసిన వారి సమాచారం ప్రకారం, ఈ నివేదికలో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ లేదా మాజీ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాల పేర్లు ప్రస్తావించలేదు. మందిర విరాళాలకు సంబంధించిన అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో, ఈ ఇద్దరు సభ్యులు జూన్ 27న ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’లోని తమ పదవులకు రాజీనామా చేశారు.
సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకముందే, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ ముగ్గురు సభ్యుల సెట్ ను ఏర్పాటు చేసింది. రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కిరణ్ ఎస్, ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక) నీల్ రతన్ కుమార్ ఇందులో ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జూన్ 23న రాష్ట్ర ప్రభుత్వానికి తన ప్రాథమిక నివేదికను సమర్పించి, అనేక కఠినమైన సిఫార్సులను చేసింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా, ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ‘శ్రీరామ జన్మభూమి’ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా, జూన్ 25న ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఈ ఎఫ్‌ఐర్‌లో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్ (అలియాస్ తిన్ను)తో పాటు ఇతర గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 13(1)(ఏ) కింద కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ తన దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, దానిని తార్కిక ముగింపునకు తీసుకురావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సిట్ ని ఆదేశించింది.
“ఫోరెన్సిక్ ఆడిటర్‌ను కూడా కలిగి ఉన్న సిట్ నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది. ఆ నివేదికను ముందుగా మేము పరిశీలించి, దానిని అన్ని పక్షాలకు బహిర్గతం చేయాలా వద్దా అని నిర్ణయిస్తాము” అని ధర్మాసనం పేర్కొంది.

More Stories
ఢిల్లీ ఎస్టీపీ టెండర్ల కుంభకోణంలో మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్
ఝార్ఖండ్ పేపర్ లీక్ లో ప్రధాన సూత్రధారి అభయ్ భార్య, సోదరుడి అరెస్ట్
బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లు రూ.1 లక్ష కోట్లు