జేపిఎస్‌ఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అభయ్ తివారీ భార్య, సోదరుడిని, పరీక్షల అక్రమాల కేసులో సిఐడి మంగళవారం అరెస్టు చేసింది. జేపిఎస్‌ఎస్సీ, జేఎస్‌ఎస్సీ – సిజిఎల్ పరీక్షలలో అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. అభయ్ తివారీ ఇప్పటికే జైలులో ఉన్నారు. అంతకుముందు, సిఐడి బృందం గిరిడిహ్‌కు వెళ్లి వీరిద్దరినీ విచారించింది.
అనంతరం వారిని అరెస్టు చేసి రాంచీకి తరలించారు. జేఎస్‌ఎస్సీ కార్యదర్శి సుధీర్ గుప్తాను కూడా సిఐడి విచారిస్తోంది. అభయ్ తివారీ సోదరుడు అక్షయ్ తివారీ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, 14వ జేపిఎస్‌ఎస్సీ పరీక్షలో ప్రిలిమినరీ టెస్ట్ ఉత్తీర్ణులయ్యారు. ఎఎస్ఓ (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)గా పనిచేస్తున్న అభయ్ తివారీ భార్యను కూడా అరెస్టు చేసి రాంచీకి తీసుకువచ్చారు.
అంతకుముందు రోజు కమిషన్ కార్యాలయంలో ఆ సంస్థ సోదాలు నిర్వహించి, సేకరించిన ఆధారాల ఆధారంగా సుధీర్ గుప్తాను గంటల తరబడి విచారించినట్లు సిఐడి అధికారులు తెలిపారు. నియామక పరీక్షల అక్రమాల్లో కీలక వ్యక్తిగా భావిస్తున్న అభయ్ తివారీ సోదరుడు అక్షయ్ తివారీని, అభయ్ తివారీ భార్యను కూడా ఈ కేసులో భాగంగా సిఐడి విచారించింది. గొడ్డా జిల్లాలోని పోరియాహట్‌లో బ్లాక్ సప్లై ఆఫీసర్ (బిఎస్ఓ)గా పనిచేస్తున్న అభయ్ తివారీని, ఈ కేసులో భాగంగా జూలై 22న సిఐడి అరెస్టు చేసింది.
విచారణ సమయంలో, తివారీ గత 13 ఏళ్లలో దాదాపు 12 పోటీ పరీక్షలలో అర్హత సాధించినట్లు సిఐడి గుర్తించిందని అధికారులు తెలిపారు. వీటిలో 2018 పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ పరీక్ష, 2013 నేవీ ఎస్ఎఆర్ పరీక్ష, 2014 భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) అసిస్టెంట్ పరీక్ష, ఐ ఆర్ బి కానిస్టేబుల్ పరీక్ష, 2018 సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పరీక్ష, 2014 నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ (ఎన్సిఎల్) పరీక్ష వంటివి ఉన్నాయని సిఐడి పేర్కొంది.
టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (టీడీపీఎల్)లో మాజీ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ ఉద్యోగి అయిన తివారీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ) నిర్వహించిన పీజీటీ టీచర్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) పరీక్షలతో పాటు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏసీఎఫ్), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ) పరీక్షలలో కూడా ఉత్తీర్ణత సాధించారు.
విచారణ సందర్భంగా, వివిధ పోటీ పరీక్షలలో అర్హత సాధించాలనుకునే అభ్యర్థుల కోసం రూ. 2 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు వేర్వేరు “రేట్ చార్టులు” ఉపయోగించారని తివారీ దర్యాప్తు అధికారులకు తెలిపారు.

More Stories
ఢిల్లీ ఎస్టీపీ టెండర్ల కుంభకోణంలో మాజీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్
అయోధ్య విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కు క్లీన్ చిట్!
బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లు రూ.1 లక్ష కోట్లు