కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరువు భత్యాన్నికేంద్రం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 2 శాతం పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. 2026, జనవరి ఒకటో తేదీ నుంచి పెంచిన డీఏ అమలులోకి వస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో, ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యంను 2 శాతం పెంచుతూ అధికారికంగా ఆమోదం తెలిపారు.
సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వెలువడాల్సిన ఈ ప్రకటన, ఈ ఏడాది కొంత ఆలస్యంగా వెలువడటంతో ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఉద్యోగులకు, పెన్షనర్లకు గడిచిన నెలలకు సంబంధించిన ఎరియర్స్ కూడా అందనున్నాయి. గత డీఏ రేటు బేసిక్ జీతంపై 58 శాతంగా ఉండేది. ఇప్పుడు పెంచిన డీఏతో అది 60 శాతం అవుతుంది.
ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో డీఏ పెంచడం కొంత ఊరటనిచ్చే అంశమే. బేసిక్ శాలరీ 18 వేలు ఉన్న ఉద్యోగి జీతం ఇప్పుడు రూ.28,800 కానున్నది. ఇక 29 వేల బేసిక్ జీతం ఉన్న వారికి 46 వేల జీతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2.5 లక్షల బేసిక్ సాలరీ ఉన్న సీనియర్ ఆఫీసర్లు ఇప్పుడు 4 లక్షల జీతం తీసుకునే అవకాశం ఉంది. ప్రతి ఏడాది డీఏను రెండసార్లు పెంచుతారు. జనవరితో పాటు జూలైలోనూ డీఏ పెరుగుతుంది.
వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా గత 12 నెలల సగటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ పెంపును నిర్ణయించారు. తాజా పెంపుతో కేంద్ర ఉద్యోగుల మొత్తం డీఏ 60 శాతానికి చేరుకుంది. 2016లో కేవలం 2 శాతంగా ఉన్న డీఏ, గత దశాబ్ద కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తూ ఇప్పుడు 60 శాతానికి చేరడం గమనార్హమని పేర్కొన్నారు.
ప్రస్తుత డీఏ పెంపు తాత్కాలిక ఊరటనిచ్చినప్పటికీ, ఉద్యోగ సంఘాలు ప్రధానంగా 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపైనే దృష్టి సారించాయి. వేతనాలు, పెన్షన్లు, సేవా నిబంధనలను సమగ్రంగా సవరించాలని వారు పట్టుబడుతున్నారు. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఏప్రిల్ 14న ప్రభుత్వానికి సమర్పించిన మెమొరాండంలో తమ డిమాండ్లను స్పష్టంగా పొందుపరిచింది.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన కోరికలు ఇక్కడ ఉన్నాయి. కనీస మూల వేతనాన్ని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి రూ.69,000కు పెంచాలి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ దీనిని 3.83గా నిర్ణయించాలని కోరుతున్నారు. డీఏ 25 శాతానికి చేరిన ప్రతిసారీ, దానిని మూల వేతనంలో విలీనం చేసే పాత పద్ధతిని మళ్ళీ ప్రారంభించాలి. ఈ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
More Stories
రూ.2,700 ఔషధానికి రూ.27,000 వేల ఎమ్మార్పీ.. సుప్రీం దిగ్బ్రాంతి
పండుగల వేళ 11 శాతం పెరిగిన పప్పుల ధరలు
స్పామ్ కాల్స్ చేసే నంబర్లపై ఏఐ నిఘా