అమెరికా కోర్టులో విచారణకు మరింత సమయం కోరిన అదానీ

అమెరికా కోర్టులో విచారణకు మరింత సమయం కోరిన అదానీ
 

దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతం అదానీ అవినీతి కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీల అవినీతిపై 2024లో యుఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఇసి) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసు విచారణలో తాజాగా పత్రాల సమర్పణకు సంబంధించి మరికొంత సమయం కావాలని ఎస్‌ఇసిని అదానీ అభ్యర్తించారు.

వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్‌ 30న ముగియాల్సి ఉండగా, గడువును జూన్‌ 8 వరకు పొడిగించాలని కోరడం గమనార్హం. ఒకవేళ కోర్టు ఈ సవరించిన షెడ్యూల్‌కు అంగీకరిస్తే సెప్టెంబర్‌ వరకు ఈ చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతాయి. దీనికి సంబంధించి జడ్జి నికోలస్‌ జి. గారాఫిస్‌ ఈ కొత్త గడువును పరిశీలిస్తున్నారు.  అదానీ గ్రూప్‌ తన సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 250 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2,100 కోట్లు) మేర లంచాలు ఇచ్చారనేది ప్రధాన అరోపణ. 
దేశంలోని పలు రాష్ట్రాల అధికారులను ఈ అవినీతిలో భాగస్వామ్యం చేసింది.  కాగా ఈ లంచం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అదానీ గ్రూప్‌ సుమారు రూ.1,750 కోట్లు పైగా లంచంగా ఇచ్చిందని లేదా ఇస్తామని హామీ ఇచ్చిందని ఎస్‌ఇసి కోర్టుకు తెలిపింది.  ఇందుకోసం గౌతమ్‌ అదానీ స్వయంగా అప్పటి ఎపి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారని, దాంతో అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందానికి ప్రభుత్వం వేగంగా ఆమోదం తెలిపిందని తద్వారా అదానీ గ్రీన్‌ ఎనర్జీకి భారీ లబ్ధి చేకూరిందని ప్రధాన అరోపణ. 
 
కాగా, ఈ అవినీతిపై తాము విచారణ చేపడుతామని ప్రస్తుత టిడిపి ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ.. దీనిపై ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. భారత్‌లో అదానీ లంచాల కేసుకు సంబంధించి ఇన్వెస్టర్లకు నిజాలు వెల్లడించకుండా దాచిపెట్టారని, ఆ తప్పుడు సమాచారంతోనే అమెరికన్‌ పెట్టుబడిదారుల నుండి సుమారు 750 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించారని ఎస్‌ఇసి అక్కడి కోర్టుకు తెలిపింది.  యూఎస్‌ సెక్యూరిటీ చట్టాల ప్రకారం ఇన్వెస్టర్లకు తప్పుడు వాగ్దానాలు చేయడం లేదా వాస్తవాలను దాచడం నేరం. 
వీటన్నింటిపై అదానీల తరపు న్యాయవాదులు సెప్టెంబర్‌ 21న తుది సమాధానం ఇస్తారు. గతంలో ఉన్న షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 30 నాటికే అదానీలు తమ పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా తాజా అభ్యర్థనతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.  ఈ కొత్త షెడ్యూల్‌ను కోర్టు ఆమోదిస్తే ఈ భారీ న్యాయ పోరాటం ఈ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.