భారతదేశంలో మార్చి నెలలో గ్యాస్ వినియోగం 13 శాతానికి పడిపోయింది. పశ్చిమాసియా సంఘర్షణలతో చమురు, గ్యాస్ సరఫరా అంతరాయంతో ఎల్‌పీజీ వినియోగం దెబ్బతినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తాజా గణాంకాలు వెల్లడించాయి. మార్చిలో ఎల్‌పీజీ వినియోగం 2.379మిలియన్ టన్నులుగా నమోదైందని, గతేడాది ఇదే సమయంలో వినియోగించిన 2.729 మిలియన్ టన్నుల కంటే 12.8శాతం తక్కువని పేర్కొంది.
భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతిపైనే ఆధారపడుతుంది. ఇందులో అధిక భాగం హార్ముజ్ జలసంధి నుండి కొనసాగుతుంది. అయితే పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. మరోవైపు సౌదీ అరేబియా, యుఎఇ నుండి కూడా సరఫరాకు అంతరాయం కలిగింది. గృహ వంటగ్యాస్ లభ్యత కోసం వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు ఎల్‌పీజీ సరఫరాపై కోత విధించినట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
మార్చిలో గృహాలకు విక్రయించిన ఎల్‌పీజీ సిలిండర్లు 8.1శాతం తగ్గి, 2.219 మిలియన్ టన్నులకు పడిపోగా, గృహేతర విక్రయాలు సుమారు 48 శాతం తగ్గాయి. మొత్తంగా ఎల్‌పీజీ విక్రయాలు ఏకంగా 75.5శాతం మేర పడిపోయాయని చమురు శాఖకు చెందిన పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (పిపిఎసి) తెలిపింది.
దీంతో ఎల్‌పీజీ సరఫరా కొనసాగుతోందని, గృహ వినియోగదారుల డిమాండ్ కు తగినట్లుగా ఎల్ పి జి పంపిణీ చేశామన్న కేంద్రం వాదనతో పోలిస్తే పిపిఎసి డేటా తక్కువ వినియోగాన్ని చూపుతోంది. కొరతను భర్తీ చేసేదుకు, ఎల్‌పీజీ ఉత్తత్తిని పెంచేందుకు పెట్రొకెమికల్ ఉత్పత్తి నుండి ఫీడ్ స్టాక్ ను మళ్లించాలని ప్రభుత్వం రిఫైపరీలను ఆదేశించింది. ఫలితంగా దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి ఏడాది క్రితం 1.1 మిలియన్ టన్నులు కాగా మార్చిలో 1.4 మిలియన్ టన్నులకు పెరిగిందని పిపిఎసి తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ నుండి 2026 మార్చి వరకు) ఎల్‌పీజీ ఉత్పత్తి, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 12.8 మిలియన్ టన్నుల నుండి 13.1 మిలియన్ టన్నులకు పెరిగింది. మార్చి నెల మినహాయింపు అయినప్పటికీ 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ వినియోగం 60 శాతం పెరిగి 33.212 మిలియన్ టన్నులకు చేరుకుంది.

More Stories
2027లో జిడిపి వృద్ధి 6.8 నుంచి 7.1 శాతం..ఎస్బిఐ రీసెర్చ్
అమెరికా కోర్టులో విచారణకు మరింత సమయం కోరిన అదానీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 2 శాతం పెంపు