పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు భారత్ ఇంధన భరోసాను కొనసాగిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక ‘భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్’ ద్వారా అదనంగా 5,000 టన్నుల డీజిల్ సరఫరాను శుక్రవారం రోజు ప్రారంభించింది. బంగ్లాదేశ్‌లో ఇంధన నిల్వలను స్థిరీకరించేందుకు, నిరంతర సరఫరాను నిర్ధారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లోని పర్బతీపూర్ పద్మ ఆయిల్ డిపో మేనేజర్ మహ్మద్ అహ్సాన్ హబీబ్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం నుంచే ఈ కొత్త డీజిల్ నిల్వలు భారత్ నుంచి డిపోకు చేరుతున్నాయి. అస్సాంలోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ (ఎన్ఆర్ఎల్) నుంచి ఈ డీజిల్ నేరుగా బంగ్లాదేశ్‌లోని రైల్ హెడ్ డిపోలకు సరఫరా అవుతోంది. ఇంధన పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో సాధారణ సెలవు దినమైన శుక్రవారం కూడా డిపోను తెరిచి ఉంచి కార్యకలాపాలను పర్యవేక్షించారు.
బంగ్లాదేశ్ ఇంధన శాఖ గణాంకాల ప్రకారం గత కొన్ని వారాలుగా భారత్ నుంచి డీజిల్ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 14వ తేదీన నుమాలిగఢ్ నుంచి 8,000 టన్నుల డీజిల్ పర్బతీపూర్ డిపోకు చేరింది. అలాగే మార్చి నెలలో మొత్తం 22,000 టన్నుల డీజిల్ సరఫరా అయింది. మార్చి నుంచి ఏప్రిల్ మధ్య నాటికి మొత్తం 30,000 టన్నుల ఇంధనం బంగ్లాదేశ్‌కు చేరింది.
మరో నాలుగు ఐదు రోజుల్లో అదనంగా మరో 7,000 టన్నుల డీజిల్ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెల మొత్తానికి బంగ్లాదేశ్ భారత్ నుంచి సుమారు 25,000 టన్నుల డీజిల్‌ను అందుకోనుంది. దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా, నిరంతర సరఫరాను కొనసాగించడానికి పైప్‌లైన్ ద్వారా దిగుమతులు చేసుకోవడమే మేలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
తక్కువ ఖర్చుతో వేగంగా ఇంధనాన్ని రవాణా చేసేందుకు ఈ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ఒక ప్రధాన వారధిగా మారింది. ఈ సహకారం ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

More Stories
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ
భారతీయ రెస్టారెంట్ లకు నెలకు రూ.79,000 కోట్ల నష్టం
ప్రపంచ వృద్ధి మందగించిగా పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ