రాణి కమలపాటి స్టేషన్ గా హబీబ్‌గంజ్

భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ పేరు రాణి కమలపాటి స్టేషన్‌గా మార్చారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం గత వారం చేసిన ప్రతిపాదనకు కేంద్రం నుండి వెంటనే ఆమోదం లభించింది.  ప్రైవేట్ భాగస్వామ్యంతో సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో పునఃఅభివృద్ధి చేసిన ఈ రైల్వే స్టేషన్ ను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. 

భారతదేశంలో స్టేషన్ పునరాభివృద్ధిలో ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వం – ప్రైవేట్ భాగస్వామ్యంతో జరగడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. పైగా, దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన మొదటి రైల్వే స్టేషన్ కూడా ఇదే. పేరు మార్చడం గోండు సమాజానికి చెందిన రాణి స్మృతి, త్యాగాలను గౌరవించడంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 


రాణి కమలపాటి నిజాం షా వితంతువు.  అతని గోండు రాజవంశం 18వ శతాబ్దంలో భోపాల్ కు 55 కి.మీ దూరంలో ఉన్న గిన్నోర్‌గఢ్‌ను పాలించింది. నిజాం షా భోపాల్‌లో ఆమె పేరుతో ఏడు అంతస్తుల కమలపతి ప్యాలెస్‌ని నిర్మించాడు.

కంపలాటి తన భర్తను చంపిన తర్వాత తన హయాంలో దురాక్రమణదారులను ఎదుర్కొవడంలో గొప్ప ధైర్యసాహసాలను ప్రదర్శించింది. కమలపతి “భోపాల్ చివరి హిందూ రాణి” అని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.  ఆమె నీటి నిర్వహణ, పార్కులు, దేవాలయాలను ఏర్పాటు చేయడంలో విశేషంగా కృషి చేశారు.

గోండులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్,  ఒడిశాలలో విస్తరించి ఉన్న భారతదేశంలోని అతిపెద్ద గిరిజన వర్గాలలో ఒకటి. 19వ శతాబ్దపు దిగ్గజ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15న ఈ స్టేషన్ పేరు మార్చడం విశేషం.

రైల్వే స్టేషన్ల పేర్లను మార్చడం కొత్త కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాల జనాదరణ పొందిన డిమాండ్ లేదా చరిత్రకు ప్రాతినిధ్యం వహించడానికి పేరు మార్పుకు వెళ్లాలని నిర్ణయించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, 1996లో, చరిత్ర , స్థానిక భావాలను గౌరవిస్తూ మద్రాస్ నగరానికి అధికారికంగా ‘చెన్నై’ అని పేరు పెట్టారు. ఫలితంగా రైల్వే స్టేషన్ పేరు కూడా మద్రాసు నుండి చెన్నైగా మారింది.

2014 నుండి, అనేక రైల్వే స్టేషన్‌లకు కొత్త పేర్లు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది మొగల్‌సరాయ్ జంక్షన్.  ఇది 1968లో మొఘల్‌సరాయ్‌లో చనిపోయిన జనసంఘ్ సిద్ధాంతకర్త గౌరవార్థం 2018లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్‌గా మారింది. అదే సంవత్సరం, యోగి ఆదియానాథ్ ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చింది.

ఆ తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని మాండూడిహ్ స్టేషన్‌కు ఆ నగరం పేరు ప్రతిబింబించే విధంగా  బెనారస్ అని పేరు మార్చారు. అయితే ఆ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద స్టేషన్‌ను ఇప్పటికే వారణాసి జంక్షన్ అని పిలుస్తున్నారు. గత దీపావళి నాడు అయోధ్య పక్కనే ఉన్న ఫైజాబాద్ జంక్షన్ స్టేషన్‌ను అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్‌గా మార్చారు.

తాజాగా, ఆజంఘ‌ఢ్ పేరును ఆర్యంఘ‌ఢ్‌గా మార్చ‌నున్న‌ట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ప్రకటించారు. ఆజంఘ‌ఢ్ పేరును ఆర్యంఘ‌ఢ్‌గా మారుస్తామ‌ని, దీనిపై ఎలాంటి సందేహాలు లేవ‌ని యోగి స్ప‌ష్టం చేశారు. భారతీయ రైల్వేలు కేంద్ర ప్రభుత్వంకు చెందినవి అయినప్పటికీ, స్టేషన్ల పేర్ల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలివేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖకు అభ్యర్థనను పంపితే, అవి ఆమోదిస్తాయి. సాధారణంగా, ప్రతిపాదిత పేరుతో ఏ ఇతర స్టేషన్ భారతదేశంలో ఎక్కడా లేదని నిర్ధారించిన తర్వాత కేంద్రం ఆమోదిస్తుంది.