జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన చెన్నై 

జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన చెన్నై 

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై జలమయమయింది. చెన్నపట్నంలో గత 17 గంటలకుపైగా విడవకుండా వాన పడుతున్నది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చెన్నైతోపాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. 

అత్యధికంగా చెన్నై చోళవరంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం  నమోదయింది. గుమ్మడిపూండిలో 18 సెంటీమీటర్లు, ఎన్నూర్‌లో 17 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. భారీ వర్షాలకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఎడతెరపిలేకుండా వానలు కురుస్తుండంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.ఏ క్షణమైన గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

తమిళనాడులోని చెన్నై సహా 20 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్​అలర్ట్​ప్రకటించింది. ఇప్పటికే కుండపోత వానలు కురుస్తున్న చెన్నైలో గురువారం భారీ వర్షం కురవొచ్చని వెల్లడించింది. వర్షం పడే టైమ్​లో జనాలు బయటకు వెళ్లొద్దని.. తిండి, నీళ్లు రెడీగా పెట్టుకోవాలని గ్రేటర్​ చెన్నై కమిషనర్​గగన్ దీప్​సింగ్​బేడి కోరారు. కమ్యూనికేషన్​కోసం ఎలక్ట్రానిక్​పరికరాలను ముందు జాగ్రత్తగా బాగా చార్జ్​చేసుకోవాలన్నారు.

చెన్నైలో 53 బోట్లు, 507 మోటార్​పంపులు, 60 హెవీ డ్యూటీ పంపులు సిద్ధం చేశామని చెప్పారు. చెన్నై తిరువళ్లూర్‌, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం మహాబలిపురం వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.

ఈ సమయంలో గంటకు 40 వేగంతో గాలులు వీస్తాయని అధికారులు సూచించారు. దీంతో మహాబలిపురంలోని పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. పర్యాటకులను అనుమతించేదిలేదని స్పష్టం చేసింది. భారీవర్షాల నేపథ్యంలో చెన్నై, నాగపట్నం, పుదుచ్చేరి కరైకాల్‌తోపాటు ఏడు ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.కొద్ది రోజులుగా తమిళనాడులో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇప్పటివరకు 46% ఎక్కువ వర్షం కురిసిందని అధికారులు చెప్పారు.

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విమానాల రాకను నిలిపివేశారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం ఇక్కడి నుంచి విమానాలు బయలుదేరుతాయని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురు గాలుల కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

భారీ వానలు, వరదలకు ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. చెన్నైలో 2015 తర్వాత ఇంత స్థాయిలో వానలు కురవడం ఇదే తొలిసారి.గత నాలుగు రోజులుగా కురిసిన కుండపోతకు డెల్టా  జిల్లాల్లోని జననివాస ప్రాంతాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలన్నీ నీటమునిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న లక్ష ఎకరాల వరిపంట నీట మునిగింది. దీంతో అన్నదాతలంతా ఆందోళన చెందుతున్నారు.

చెన్నైలోని కేకే న‌గ‌ర్‌లోని ఈఎస్ఐ ఆస్ప‌త్రిలోకి భారీగా వ‌ర్ష‌పు నీరు చేరింది. ప‌లు వార్డుల్లోకి వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో రోగులు, వారి స‌హాయ‌కులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఈఎస్ఐ ఆస్ప‌త్రి డాక్ట‌ర్ మ‌హేశ్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఉన్న సిబ్బందితో ఔట్ పేషెంట్ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. కొవిడ్ వార్డుల‌తో పాటు ఇత‌ర వార్డుల్లో ఉన్న రోగుల‌కు ఇబ్బంది లేకుండా వైద్య సేవ‌లందిస్తున్నామ‌ని చెప్పారు.

వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 75 వేల మంది పోలీసులు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ శైలేంద్రబాబు ప్రకటించారు.  రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, సాయుధ విభాగం, ప్రత్యేక పోలీస్‌ విభాగం, తమిళనాడు హోంగార్డ్స్‌ ఇలా అన్ని పోలీసు విభాగాల నుంచి 75 వేల మంది రక్షక భటులను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. అలాగే, వివిధ రంగాల్లో శిక్షణ పొందిన వారిని బృందాలుగా ఏర్పాటు చేశామని, ఈ బృందాల్లో మూడింటిని చెన్నైకు, తంజావూరు, కడలూరుకు ఒక్కో టీం పంపించినట్టు పేర్కొన్నారు.

ఈశాన్య రుతుపవనాల కారణంగా గత నాలుగు రోజులుగా చెన్నైలో,  తమిళనాడు అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, పెరంబూర్ బ్యారక్స్ రోడ్, పట్టాళం, ఆనుకుని ఉన్న పులియంతోప్, పెరంబూర్‌తో సహా రాజధానిలోని ఉత్తర ప్రాంతాలలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిలిచిపోయిన నీరు తగ్గకపోవడంతో అనేక ఇళ్లలోకి ప్రవేశించడంతో నివాసితులు వీధుల్లోనే నివాసముంటున్నారు. డెంగ్యూతో సహా వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్న మురుగునీరు కలిపిన వర్షపునీటికి భయపడి కొంతమంది నివాసితులు వదిలివేస్తున్నారు. చాలా వరకు ఆహార సామాగ్రి కూడా అయిపోయింది.

నవంబర్ 6 నుండి, చెన్నై, దాని పొరుగు జిల్లాలు కాంచీపురం, చెంగల్పట్టు, కారైకల్, తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం, బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడనం అల్పపీడనంగా కేంద్రీకృతమై, నవంబర్ 11 సాయంత్రం నాటికి ఇది తీరం దాటే అవకాశం ఉంది. వాతావరణ వ్యవస్థ అదే సాయంత్రం పుదుచ్చేరికి ఉత్తరాన కారైకాల్ , శ్రీహరికోట మధ్య ఉత్తర తమిళనాడు, ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది.