చైనా నేతలు భిన్నత్వం అర్థమే గ్రహించలేరు 

చైనా నేతలకు భిన్నత్వం, వైవిధ్య సంస్కృతులపై అవగాహనలేదని, అసలు వీటి అర్థమే గ్రహించలేరని బౌద్ధ గురువు దలైలామా ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న ఈ మతగురువు తాను భారత్‌లోనే ఉంటానని, అక్కడి ప్రశాంతత తనను ఆకట్టుకుందని తెలిపారు. తైవాన్‌, చైనా మ‌ధ్య సంబంధాలు బ‌ల‌హీనంగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ‌కి వెళ్ల‌లేన‌ని స్పష్టం చేశారు.

చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ నేతల పాటిస్తున్న కట్టుదిట్టమైన సామాజిక నియంత్రణలతో చేటు తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ సంస్కృతులతో తలెత్తే వైవిధ్యతను చైనా కమ్యూనిస్టులు భరించలేరని, దీని గురించి వారికి ఏదైనా అవగావహన ఏర్పడితే, వారు దీనిని అర్థం చేసుకుంటే కదా? వారు దీనిని ఆదరించే పరిస్థితి ఏర్పడేది అని అంటూ ఎద్దేవా చేశారు. 

86 సంవత్సరాల ఈ బౌద్ధ సన్యాసి చాలాకాలంగా భారత్‌లోనే ఆశ్రయం పొంది ప్రవాస జీవితం గడుపుతున్నారు. టోక్యో వేదికగా జరిగిన ఓ ఆన్‌లైన్ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు దలైలామా సమాధానాలు ఇచ్చారు. టోక్యోఫారెన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. తాను చైనా నేత జిన్‌పింగ్‌ను కలిసే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. 

చైనాలో జిన్‌పింగ్ మూడోసారి కూడా సర్వం సహా అధికారాలను చేపట్టబోయే ప్రక్రియ గురించి, జిన్‌పింగ్ సర్వసత్తాకత గురించి మాట్లాడేందుకు దలైలామా నిరాకరించారు. ఇతర భావాలను, ఆచార వ్యవహారాలను వారు అంగీకరించేందుకు ముందుకు రానేరారు. ఇది చాలా ప్రమాదకర ధోరణి అవుతుందని దలైలామా హెచ్చరించారు. 

ప్రజలపై సామాజికపు పూర్తి స్థాయి కట్టుబాట్లు విధించడం భిన్న సంస్కృతులను ఆదరించకపోవడం హానికారకం అవుతుందని స్పష్టం చేశారు. ఇతర మతాలు, సంస్కృతులపై చైనా ఆధిపత్యం తీవ్రస్థాయిలో అణచివేతకు దిగిందనే విమర్శలు ఉన్నాయని గుర్తు చేశారు. టిబెటియన్లు, టర్కిక్ ముస్లిం య్యూగూర్స్, ఇతర మైనార్టీ వర్గాలపై దాడులను వారి సంస్కృతి సంప్రదాయల అణచివేత దిశగా తీవ్రతరం చేసిందనే విమర్శలు ఉన్నాయి. చైనాలో హ‌న్ తెగ‌కు చెందిన వారి ఆధిప‌త్యం మ‌రీ ఎక్కువగా ఉంటుంద‌ని ద‌లైలామా చెప్పారు.

మావో జిదాంగ్ నుంచి త‌న‌కు క‌మ్యూనిస్టు నేత‌లు తెలుసు అని, వారి ఆశ‌యాలు మంచివ‌ని, కానీ కొన్ని సంద‌ర్భాల్లో వాళ్లు విప‌రీతంగా ప్ర‌వ‌ర్తిస్తార‌ని, పూర్తి ఆధిప‌త్యం చెలాయిస్తార‌ని ద‌లైలామా పేర్కొన్నారు. కొత్త త‌రం నేత‌ల పాల‌న‌లో చైనా మారుతుంద‌ని భావించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

అయితే తాను స్థానిక రాజకీయ సంక్లిష్టతల విషయంలో జోక్యం చేసుకోదల్చుకోలేదని, అయితే తైవాన్, చైనా ప్రధాన భూభాగంలోని సోదరసోదరీల గురించి పట్టించుకుంటానని, ఇందులో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. కానీ చైనా సోద‌ర సోద‌రీమ‌ణుల ప‌ట్ల త‌న‌కు ద్వేష‌భావం లేద‌ని దలైలామా స్పష్టం చేశారు. క‌మ్యూనిజం, మార్కిజ‌మ్ భావాల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు.