కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ భయపెడితే బీజేపీ కార్యకర్తలు ఎవరు బెదిరిపోరని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ధర్నాలు చేస్తే, వాయిస్ పెంచితే కేంద్రం భయపడదని పేర్కొన్నారు. 2014లో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కేంద్ర ప్రభుత్వం తీసుకోగా, 2021 లో తెలుగు రాష్ట్రాల నుంచి 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కేంద్రం సేకరించిందని ఆయన చెప్పారు.
2019–20లో తెలంగాణ నుంచి 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని తెలిపారు.తెలంగాణలో 2014లో ధాన్యం సేకరణకు రూ. 3400 కోట్ల డబ్బును ఖర్చు పెట్టగా, 2020- 21 లో రూ.26,646 కోట్లు సేకరణకు ఖర్చు పెడుతుందని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణకు మిల్లింగ్ చార్జీలు, బ్యాగ్‌ లు,ట్రాన్ పోర్ట్ ఖర్చులు అన్ని లెక్క గట్టి కేంద్రమే ఖర్చులు భరిస్తుందని స్పష్టం చేశారు.

కేంద్రం పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యాన్ని తెలంగాణలో కొంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇస్తూ  అత్యధికంగా పంజాబ్ లో 135 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, ఆ తర్వాత తెలంగాణలో 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పరు.

2020-21 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే. 94.54 శాతం ధాన్యాన్ని తెలంగాణను నుంచి సేకరిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో బాయిల్డ్ రైస్ కు డిమాండ్ తగ్గిందని చెబుతూ దానితో తెలంగాణపై కేంద్రానికి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి ప్రజలను రైతులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి హితవు చెప్పారు. బాయిల్డ్ రైస్ తెలంగాణా లో ఎవరు తినరని చెబుతూ కేరళలోను తినడం తగ్గించారని గుర్తు చేశారు.  రైతులు బాయిల్డ్ రైస్ పండించరని, బాయిల్డ్ రైస్ తయారు చేసేది మిల్లర్లని పేర్కొన్నారు. 

వినియోగించే పరిస్థితి లేనపుడు ప్రజా ధనం వృధా అవుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు. 2021 లోనే 20 లక్షల మెట్రిక్ టన్నులు  తీసుకోవాలని., తదుపరి మిల్లర్ల సామగ్రి మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి  లేఖ రాసిందని కేంద్ర మంత్రి చెప్పారు. భవిష్యత్తులో కేంద్రానికి దొడ్డు  బియ్యం పంపమని రాష్ట్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసిందని చెబుతూ రాష్ట్రంలో ఎంత ధాన్యం పండిస్తున్నారో ప్రభుత్వానికి అవగాహన లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగు పడటంతో పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గించిందని ఆయన చెప్పారు.

నిరుద్యోగ మిలియన్ మార్చ్ పోస్టర్‌

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ ఈనెల‌ 16న బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మిలియన్ మార్చ్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నిరుద్యోగ మిలియన్ మార్చ్ పోస్టర్‌ను బీజేపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధానకార్యదర్శి ప్రదీప్ రావు మాట్లాడుతూ ఉద్యమంలో ఉద్యోగాల పేరుతో విద్యార్థులను కేసీఆర్ రెచ్చగొట్టారని గుర్తు చేశారు.

తెలంగాణ వచ్చాక కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం అన్యాయమని మండిపడ్డారు. ఉద్యోగాల‌ కోసం 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరమని చెప్పారు.  ఇకపై ఆత్మహత్యలు ఉండకూడదని… నిరుద్యోగులకు భరోసా ఇచ్చేందుకే బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొనేవారు రిజిస్టర్ చేసుకునేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని… 6359119119 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలని ప్రదీప్ రావు తెలిపారు.