పలు దేశాల్లో మరోసారి విజృంభిస్తోన్న కరోనా 

పలు దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో సోమవారం 39,400 పాజిటివ్‌ కేసులు, 1,190 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ కొనసాగుతున్నప్పటికీ.. తొమ్మిది రోజుల లాక్‌డౌన్‌ అనంతరం ఉద్యోగులు సోమవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అక్టోబరు చివరివారం నుండి రష్యాలో ప్రతి రోజూ 1,100 మంది కరోనాతో మరణిస్తున్నారు.

జర్మనీలోనూ గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వారంరోజులుగా ప్రతి లక్షమందిలో 201 మంది వైరస్‌ బారిన పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,513 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ముందురోజు 37,120 కేసులు వచ్చాయని, వ్యాక్సిన్‌ కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం వల్లే వైరస్‌ మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో తాజా ఉధృతిని  ‘ వ్యాక్సిన్‌ తీసుకోనివారి మహమ్మారి’గా పిలుస్తున్నారు.

మరోవైపు, జపాన్‌లో మొదటిసారిగా సోమవారం ఒక్క కరోనా మృతి కేసు కూడా నమోదు కాలేదు. 15 నెలల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో విదేశీ విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులపై గతంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలించింది. క్వారంటైన్‌ను 10 రోజుల నుండి మూడు రోజులకు తగ్గించింది. జపాన్‌లో నెమ్మదిగా ప్రారంభమైన వ్యాక్సిన్‌ కార్యక్రమం జూన్‌ నుండి వేగం పుంజుకుందని, 74 శాతం మందికి ఇప్పటికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌లు వేసినట్లు అధికారులు తెలిపారు.

స్లొవేకియాలో కరోనా విజృంభిస్తోంది. జనాభాలో సగం మంది కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. హోటల్స్‌, రెస్టారెంట్లను మూసివేయించింది. ప్రజలంతా వ్యాక్సిన్‌లు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి వ్లాదిమిర్‌ లాంగ్వాస్కీ ప్రజలకు పిలుపునిచ్చారు.

చైనాలో కూడా వైరస్‌ ఉధృతి అధికంగా ఉంది. మూడింట రెండొంతుల రాష్ట్రాల్లో వందల మంది కరోనాబారిన పడినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్సు క‌రోనా వైర‌స్‌పై ప్ర‌జాయుద్ధాన్ని ప్ర‌క‌టించింది. ర‌ష్యాతో స‌రిహ‌ద్దుల్లో ఉన్న హీహే న‌గ‌రం తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

కొత్త‌గా విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్ల‌ను గుర్తిస్తే వారికి ల‌క్ష యువాన్లు (15,500 డాల‌ర్లు) ఇస్తామ‌ని ఆ న‌గ‌రం ప్ర‌క‌టించింది. ఎక్క‌డ నుంచి వైర‌స్ వ్యాపించింది, ఎలా ఆ వైర‌స్ ప్ర‌బ‌లుతోంద‌న్న అంశాల‌ను తేల్చేందుకు స్థానిక ప్ర‌భుత్వం ఆ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల చైనాలో డెల్టా వేరియంట్‌కు చెందిన క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ తీవ్ర స్థాయిలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించారు.

భారత్ లో 9 నెలల కనిష్ఠంకు 

కాగా, దేశంలో కరోనా కేసులు 9 నెలల కనిష్టానికి పడిపోయాయి. కేసులు 10 వేల దిగువకు చేరాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది. గత 24 గంటల్లో 10,126 మందికి కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3.43 కోట్లకు చేరుకుంది. వారిలో 3.37 కోట్ల మంది వైరస్‌ నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య 1.40 లక్షలకు తగ్గింది. ఈ సంఖ్య 263 రోజుల కనిష్టానికి చేరింది. క్రియాశీల రేటు 0.41 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.25 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా 332 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 4,61,389 మంది మరణించారు.