ఆఫ్ఘన్ పై ఢిల్లీ సమావేశంపై పాక్, చైనా గైరాజర్ 

ఆఫ్ఘనిస్థాన్‌ పరిణామాలపై భారత దేశం నిర్వహిస్తున్న ప్రాంతీయ భద్రతా సమావేశానికి పాకిస్థాన్ తో పాటు చైనా సహితం గైరాజరు అవుతున్నట్లు తెలుస్తున్నది.   నవంబరు 10న న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి హాజరయ్యేది లేదని గతంలోనే పాకిస్థాన్ చెప్పగా, ఈ ప్రాంతంలోని రష్యా, ఇరాన్, తజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, కజకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే  ఈ సమావేశానికి హాజరు కావడానికి షెడ్యూలింగ్ సమస్యలు ఉన్నాయని చైనా చెప్తోందని జాతీయ మీడియా తెలిపింది. దీని అర్థం ఈ సమావేశానికి హాజరుకాబోమని చెప్పడమేనని తెలిపింది. 

ఈ ప్రాంతంలోని దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. తాను హాజరు కాబోనని పాకిస్థాన్ గత వారమే ప్రకటించింది. వీరిద్దరూ తాలిబాన్లకు ప్రతికూల సంకేతం పంపినట్లు కాగలదని సమావేశంలో పాల్గొనడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

ద్వైపాక్షిక దౌత్య మార్గాల్లో చర్చలకు సిద్ధమేనని చైనా చెప్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం వల్ల ఆ దేశంలోనూ, దాని సరిహద్దుల్లోని దేశాల్లోనూ ఉత్పన్నమయ్యే సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఓ ప్రాంతీయ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఢిల్లీ సమావేశం లక్ష్యం. 

రాడికలైజేషన్, అతివాదం, ఉగ్రవాదం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం, మాదక ద్రవ్యాల ఉత్పత్తి, మనుషుల అక్రమ రవాణా, అమెరికా, దాని మిత్ర పక్షాలు వదిలేసిన ఆయుధాల వాడకం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. 

ఈ సమావేశంలో రియర్ అడ్మిరల్ అలీ షంఖని (ఇరాన్), నికొలాయ్ పీ పట్రుషేవ్ (రష్యా), కరీం మసిమోవ్ (కజకిస్థాన్), మరట్ ముకనోవిచ్ ఇమాంకులోవ్ (కిర్గిజ్‌స్థాన్), నస్రెల్లో రహమత్జోన్ మహ్ముద్జోడా (తజకిస్థాన్), చరిమిరాట్ కాకలయ్యెవిచ్ అమవోవ్ (తుర్క్‌మెనిస్థాన్), విక్టర్ మఖ్ముడోవ్ (ఉజ్బెకిస్థాన్) పాల్గొంటారని తెలుస్తోంది. వీరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.