అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌తో మంత్రి మాలిక్‌కు లింక్

మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్‌కు అండ‌ర్‌వ‌ర‌ల్డ్‌తో లింకులు ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత  దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న‌వారి నుంచి మంత్రి న‌వాబ్ మాలిక్ గ‌తంలో భూమి కొనుగోలు చేసిన‌ట్లు ఆయన  ఆరోపించారు. 

బాంబు పేలుళ్ల నిందితుడు స‌ర్దార్ షావాలీ ఖాన్‌, స‌లీమ్ ఇషాక్ ప‌టేల్ నుంచి భూమి కొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి హ‌సీనా పార్క‌ర్‌తో ఆ ఇద్ద‌రికీ లింకులు ఉన్న‌ట్లు ఫ‌డ్న‌వీస్ చెప్పారు. 

ఇవాళ ముంబైలోని బీజేపీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ  కుర్లాలోని ఎల్‌బీఎస్ మార్గ్‌లో ఉన్న 2.80 ఎక‌రాల స్థ‌లాన్ని సోలిడ‌స్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కేవ‌లం రూ 30 ల‌క్ష‌లకు కొనుగోలు చేసింద‌ని, ఆ ఒప్పందంపై న‌వాబ్ మాలిక్ కుమారుడు ఫ‌రాజ్ మాలిక్ సంత‌కం చేశార‌ని వెల్లడించారు. 

ఆ కంపెనీలో న‌వాబ్ కీల‌క పోస్టులో ఉన్నార‌ని, కానీ మంత్రి ప‌ద‌వి స్వీక‌రించ‌డానికి ముందు దానికి రాజీనామా చేసిన‌ట్లు ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను మంత్రి మాలిక్ కొట్టిపారేశారు. ఫ‌డ్న‌వీస్ ఆరోప‌ణ‌ల‌పై రేపు హైడ్రోజ‌న్ బాంబును విస‌ర‌నున్న‌ట్లు మాలిక్ తెలిపారు. 

షారూక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ అరెస్టు విష‌యంలో ఎన్సీబీ డైర‌క్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డేపై మంత్రి మాలిక్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ కేసు విష‌యంలో ఎన్సీపీ నేత మంత్రి మాలిక్‌, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది.