టి20 భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ

న‌వంబ‌ర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భార‌త్‌కు అంత‌ర్జాతీయ టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. దాని కోసం టీమిండియా ఇప్ప‌టి నుంచే ప్రాక్టీస్ మొద‌లు పెట్టింది. ఇది హోమ్ టూర్‌. భార‌త్‌లోనే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ కోసం బీసీసీఐ తాజాగా టీమిండియా జ‌ట్టును ప్ర‌క‌టించింది.

న‌వంబ‌ర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భార‌త్‌.. మూడు అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది.న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీకి పూర్తిగా రెస్ట్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో కోహ్లీ ఆడ‌టం లేదు. విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌కు కెప్టెన్సీ బాధ్య‌త నుంచి త‌ప్పుకోవ‌డంతో.. జ‌ట్టు ప‌గ్గాల‌ను బీసీసీఐ రోహిత్ శ‌ర్మ‌కు అందించింది. మొత్తం 16 స‌భ్యుల టీమ్‌ను బీసీసీఐ తాజాగా ప్ర‌క‌టించింది. ఇక వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నాడు. 

టీమిండియా నుంచి సెలెక్ట్ అయిన 16 స‌భ్యుల జ‌ట్టు స‌భ్యులలో.. రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌(వైస్ కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్‌, శ్రెయాస్ అయ్య‌ర్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, రిష‌బ్ పంత్‌(వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిష‌న్‌(వికెట్ కీప‌ర్‌), వెంక‌టేశ్ అయ్య‌ర్‌, యుజువేంద్ర చాహ‌ల్‌, ఆర్ అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అవేష్ ఖాన్, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, దీప‌క్ చాహ‌ర్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ ఉన్నారు.

జట్టు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లలో ఒకరిని సారధి చేయాలని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి తొందరపాటు నిర్ణయం వద్దని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు.

2023 ప్రపంచకప్‌ కోసమైతే దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని, కానీ వచ్చే ఏడాది మరో ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో జట్టుకు కప్పు అందించగలిగే వ్యక్తిని ఎంచుకోవాలని చెప్పాడు. ఈ విషయంలో రోహిత్‌ శర్మ సరైన చాయిస్ అని, వచ్చే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సారధ్య బాధ్యతలు అతనికే అందించాలని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు.