కేసీఆర్.. బండి సంజయ్ మెడలు ఇరుస్తడా?

‘పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్.. బండి సంజయ్ మెడలు ఇరుస్తడా?” అంటూ బిజెపి సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు.  ఈ వింత ప్రచార మాటలు హుజూరాబాద్​కు వచ్చి ఎందుకు మాట్లాడలె? మీ అబద్ధాలకు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నరు” అంటూ ఆమె నిలదీశారు. 

ఇన్ని దినాలకు బయటకొచ్చిన ఈ టూరిస్టు సీఎం మల్లా డంభాచారం మాట్లాడుతున్నారని.. నమ్మేటోళ్లు లేరని ఆమె స్పష్టం చేశారు. ‘‘చాలా రోజులుగా బండి సంజయ్‌ అతిగా మాట్లాడుతున్నారు. నాపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. బండి సంజయ్‌ నా స్థాయి కాదు కాబట్టే నేను పట్టించుకోలేదు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అరుస్తున్నాయని ఊరుకున్నా’’ అని కేసీఆర్ చేసిన విమర్శలను ఆమె కొట్టిపారవేసారు.

దళిత సీఎం, దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూంల లాగ దళితబంధు విషయంలోనూ మోసం చేస్తారని, అందుకే కేసీఆర్​మెడలు వంచి అమలు చేయించడానికే బీజేపీ ఉద్యమమని ఆమె స్పష్టం చేశారు. హుజూరాబాద్ చిన్న ఎన్నికైతే రూ. 500 కోట్ల సొంత డబ్బు.. వేల కోట్ల పథకాల డబ్బుతో ఎందుకు ప్రయత్నించారని విజయశాంతి ప్రశ్నించారు. 

ఒక్క రోజు కూడా సరిగా ఉద్యమంలో పాల్గొనని, చివరికి పార్లమెంట్‌‌లో తెలంగాణ బిల్లు పాసయ్యే టైమ్​లో కొట్లాటలో లేని కేసీఆర్.. ఉద్యమకారుడినని ఎట్లా చెప్పుకుంటున్నారని ఆమె నిలదీశారు.  వ్యాట్ పెంచలేదని చెబుతున్నారని అంటూ పెట్రోల్, డీజిల్​పై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్ తగ్గించాలని ఆమె డిమాండ్​చేశారు. ​

ఎంఐఎం మిత్రపక్షమని బాజప్తాగా చెప్పుకున్న సీఎం.. బీజేపీని గొడవలు పెట్టే పార్టీ అనడం నిజాం రజాకార్లకు సలాం చేసే స్వభావం మాత్రమేనని విజయశాంతి విమర్శించారు. ‘కేసీఆరే కాదు.. అవినీతి ఎవరు చేసినా జైలుకే పోతారు. టచ్ చేసి చూడని అంటే.. చట్టం చూస్తూ ఊరుకోదు. లాలు, చౌతాలా కన్నా మీరేం పెద్ద నాయకులు కాదు’ అని ధ్వజమెత్తారు. 

దేశంలో చక్రం తిప్పుతున్నామని తోక తెగ్గొట్టుకున్న ఫెడరల్ ఫ్రంట్ మీది కాదా అని ఆమె ఎద్దేవా చేశారు.   గత రైతు ఉద్యమంలో ఢిల్లీలో ఉండి కూడా రైతులను లెక్క చేయనప్పుడే మీ పోరాటం దేశమంతా చూసిందని ఆమె దుయ్యబట్టారు. లక్ష కోట్లు తిన్న కేసీఆర్.. పేదల గురించి మాట్లాడే పరిస్థితికి హుజూరాబాద్ ఫలితం తెచ్చిందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పార్టీలే సీఎంను ఊరూరా తిడుతున్నాయని.. భ్రమల నుంచి కేసీఆర్​ బయటికొస్తే మేలని విజయశాంతి హితవు చెప్పారు. .

ఇలా ఉండగా, ఎన్నికలలో  ఓడిపోయానని సీఎం కేసీఆర్ నిరాశ లో కూరుకపొయిండని, స్థాయి మర్చి ఎస్సీ, ఎస్టీ చట్టంపై అబద్ధాలు చెప్పే నీచానికి దిగజారిండని బీజేపీ ఎంపీ డి అరవింద్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసింది బీజేపీనే అని ఆయన స్పష్టం చేశారు.  అధికార బలంతో తీన్మార్ మల్లన్నకు బెయిల్ రాకుండా కేసీఆర్ అడ్డు పడ్తున్నడని ఆరోపించారు. ‘‘మల్లన్న భార్య దళితురాలు. ఆమెకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అండ ఉండాలనే ఆయనతో భేటీ చేయించిన. అదీ దళితులపై నాకున్న చిత్తశుద్ధి!’’ అని ఆయన చెప్పారు.