కేసీఆర్ అంకుల్‎కి కోపమొచ్చింది… ఏ భాషలోనైనా తిట్టగలడు

‘కేసీఆర్ అంకుల్‎కి కోపమొచ్చింది. మమ్మల్ని తిట్టుకుంటూ కేసీఆర్ బాగా ఎంజాయ్ చేశాడు’ అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంను లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలను తిప్పికొడుతూ `కెసీఆర్ బహుభాషా కోవిదుడు కాదు.. బూతుభాషా కోవిదుడు. ఆయన ఏ భాషలోనైనా తిట్టగలడు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు’ అంటూ ధ్వజమెత్తారు. 

హుజురాబాద్ ఓటమి తర్వాత కూడా కేసీఆర్ లో మార్పు రాలేదని దుయ్యబట్టారు. రైతులు కార్లలో తిరుగుతున్నారన్నారు కదా.. రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు. రైతు రుణమాఫీ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? మీ సిద్దిపేట జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కేసీఆర్‎కు కనబడటం లేదా? అంటూ ప్రశ్నించారు. 

ఉద్యోగాలు ఇవ్వనందునే నిరుద్యోగులు కూలీలుగా మారుతుని పేర్కొంటూ రైతు ఆత్మహత్యలు కేసీఆర్‌కు కనిపించడం లేదా? అని నిలదీశారు. ప్రతీ గింజా మేమే కొంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కేంద్రం పెత్తనం ఏందని అప్పట్లో కేసీఆర్‌ విమర్శించారని గుర్తు చేశారు.  గంటకో మాట మాట్లాడి రైతులను కేసీఆరే ఆగం చేశాడని మండిపడ్డారు. వరి వేయాలని ఓసారి, వేయొద్దని మరోసారి చెప్పడంతో రైతులు ఆగమయ్యారని చెప్పారు. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగయితే చూపించాలని సవాల్ చేశారు. 

రైతుల నుంచి వడ్లు కేంద్రమే కొంటోందని స్పష్టం చేస్తూ కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం లెటర్ ఇచ్చిందని సంజయ్ తెలిపారు. బియ్యం కొనుగోళ్లపై ఎఫ్‎సీఐతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు. రైతుల చట్టాల విషయంలో కేసీఆర్‌ పూటకో మాట మాట్లాడతారని ధ్వజమెత్తుతూ మార్కెట్‌ కమిటీలను రద్దు చేస్తామని కేంద్రం ఎప్పుడు చెప్పింది? దమ్ముంటే కేసీఆర్‌ ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.

దేశంలో 24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తగ్గించదని కేసీఆర్ ను బండి సంజయ్  ప్రశ్నించారు. రాష్ట్రానికి లీటర్ పెట్రోల్ మీద వ్యాట్ ద్వారా రూ. 28 వస్తున్నాయని చెబుతూ వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాలలో తెలంగాణ రెండోస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచలేదని కేసీఆర్‌ చెబుతున్నారని, అయితే 2015లో తెలంగాణ రాష్ట్ర వ్యాట్‌ పెంచిందని, జీవోలు కూడా ఉన్నాయని సంజయ్‌ ఆరోపించారు.