
అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 29న తలపెట్టిన ‘‘విజయ గర్జన’’ సభకు భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. వారి అభ్యంతరాలను ఖాతరు చేయకుండా టీఆర్‌ఎస్ నేతలు, రెవెన్యూ అధికారులు, కుడా అధికారులతో సర్వేలు చేయిస్తుండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క రోజు సభ కోసం వందల ఎకరాల్లో పొలాలు పాడు చేయొద్దంటూ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా టీఆర్ఎస్నేతలు ఖాతరు చేయడం లేదు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో సభ నిర్వహణకు అవసరమైన పనులను శనివారం షురూ చేశారు.
పంట పొలాల్లో సభ నిర్వహించవద్దంటూ దేవన్నపేట రైతులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. శనివారం ఉదయం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఇతర రాజకీయ నాయకులు విజయగర్జన సభ ఏర్పాట్లకు కొబ్బరికాయ కొడతారన్న సమాచారం మేరకు రైతులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు.
రైతులంతా పొలాలకు ఒకవైపు ఉండగా.. మరోవైపు నుంచి డీసీసీబీ డైరెక్టర్గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి, మాజీ కార్పొరేటర్, ప్రస్తుత 65వ డివిజన్ కార్పొరేటర్భర్త రాజునాయక్ సభా ప్రాంగణానికి పరిశీలించిన స్థలానికి చేరుకున్నారు. అక్కడ వెంచర్లు చేసిన వ్యక్తితో కలిసి ప్లాట్ల ఓనర్లు, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
దీంతో రైతులంతా వారిని చుట్టుముట్టారు. వ్యవసాయ భూములు, వెంచర్ ప్లాట్లను సాఫ్ చేస్తే హద్దుల సమస్యలు ఏర్పడతాయని, చేతికొచ్చిన పంటలు నోటికందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోకుండా పనులు ప్రారంభించడానికి ఎలా వస్తారంటూ నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అప్పటికే సిబ్బందితో అక్కడికి చేరుకున్న హసన్పర్తి సీఐ శ్రీధర్రావు రైతులను అడ్డుకున్నారు. ఆందోళన విరమించకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ స్థలాలు మీ అయ్యా జాగీరా? అంటూ దూషించారు. దీంతో రైతులు… రాజునాయక్, సీఐతో వాదనకు దిగారు. అవసరమైతే ఇక్కడే చస్తాం కాని సభ పెట్టనివ్వమని ఆందోళన కొనసాగించారు.
ఓ వైపు టీఆర్ఎస్నాయకులు, మరోవైపు పోలీసులు రైతులను నియంత్రించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి, రాజు నాయక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమవైపు ఉంటూనే డబుల్డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు తమతో ఉండి వెంటనే నాయకుల పక్షాన చేరారని మండిపడ్డారు. పంట పొలాల్లో సభలు నిర్వహించడం కరెక్ట్ కాదని, సభ కోసం భూములు ఇవ్వడం లేదని వ్యవసాయ బావుల కరెంట్ కనెక్షన్ కట్చేస్తున్నారని వాపోయారు.
సభ నిర్వహణకు స్థలం ఇచ్చేందుకు తమకు అభ్యంతరం ఏమీ లేదంటూ కొందరు ప్లాట్ల ఓనర్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్కు లేఖలు ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న రైతుల భూముల నుంచి విజయగర్జన సభకు పనులు ప్రారంభించారు. మధు తండా మార్గం నుంచి సభా ప్రాంగణానికి రోడ్డు పనులు ప్రారంభించారు. ఆందోళన చేస్తున్న రైతులంతా ఇండ్లకు చేరిన తరువాత శనివారం సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పనులను పరిశీలించారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
రెండు రోజులు వర్షాలు పడే అవకాశం