2023లో తెలంగాణాలో బీజేపీ జెండా ఎగరబోతుంది 

2023లో తెలంగాణాలో బీజేపీ జెండా ఎగరబోతుందన్నారని,  నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ లోని బిజెపి కార్యాలయంకు విజయోత్సవ ర్యాలీలో వచ్చినప్పుడు శనివారం ఆయనకు ఘనస్వాగతం లభించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేసీఆర్ అరిష్టపాలనను అంతం చేయాలని ప్రజలు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణాలో ఆట మొదలైనది అంటూ  2023లో టీఆర్ఎస్‌ పార్టీని ప్రజలు పాతర వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఎన్నికలతో మొదలైన ఆట.. తెలంగాణ మొత్తాన్నీ అంటుకుని టీఆర్‌ఎ్‌సను ఖతం చేయడం ఖాయమని చెప్పారు.

తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది కానీ..ఆత్మగౌరవాన్ని అమ్ముకోదు. బానిసత్వం చెల్లదని హుజురాబాద్ గడ్డ నిరూపించిందని ఆయన చెప్పారు. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెల్లుమనిపించారని పేర్కొంటూ ప్రజా స్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా పులి బిడ్డల్లాగా ఓట్లేసి గెలిపించారని పేర్కొన్నారు.

ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే ఎన్నిక అని అంటూ కేసీఆర్ అహంకారాన్ని దించేలా చేశారని చెప్పారు. అధికార, ధన బలంతో పోలీసుల ముందే డబ్బులు పంచినా    ప్రజలు మాత్రం ధర్మం వైపే నిలబడ్డారని కొనియాడారు.

‘‘హుజూరాబాద్‌లో పోలీసులు ప్రజలను బెదిరించారు. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటేనే లాభమవుతుందని చెప్పారు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఎన్నికల సంఘానికి ఆధారాలన్నీ పంపిస్తా. డీజీపీ మహేందర్‌రెడ్డికి ఒక్కటే చెబుతున్నా.. కేసీఆర్‌ చూపిన పోస్టులకు ఆశపడి, మీరు చేసిన చిల్లర పనులకు తెలంగాణ జాతి సిగ్గుపడుతోంది” అంటూ ధ్వజమెత్తారు. 

తాను ఆర్థిక మంత్రిగా పని చేశానని చెబుతూ దళితబంధు అమలు కావాలంటే మరో 20 ఏళ్లు కావాలని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందని ఆరోపిస్తూ ప్రజలను బానిసలుగా చేసుకొని పాలనసాగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. హుజురాబాద్ లో గెలిచేందుకు 2,500 కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తూ ఆ డబ్బంత ఎక్కడి నుంచివచ్చిందని నిలదీశారు.

తెలంగాణలో ప్రజాపాలన బీజేపీతోనే సాధ్యమని చెబుతూ  ఉద్యమకారులు, కవులు, కళాకారులు బీజేపీలోకి రావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ‘టీఆర్‌ఎస్‌ సభ పేరు విజయ గర్జన కాదు.. కల్వకుంట్ల గర్జన అని పెట్టుకుంటే బాగుంటుంది’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తులతో రాష్ట్రంలో పాలన జరుగుతోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ఎన్ని డబ్బులు కుమ్మరించినా..  ప్రజలు లొంగరని హుజూరాబాద్‌వాసులు నిరూపించారని  సంతోషం వ్యక్తం చేశారు.

ఉద్యమాన్ని బతికించి.. హుజురాబాద్ ప్రజలు తెలంగాణ గౌరవం నిలిపారని మాజీ ఎంపీ విజయశాంతి కొనియాడారు. ఎడవ కాలు చెప్పుతో హుజురాబాద్‌ ఉపఎన్నికలో ప్రజలు కేసీఆర్ చెంప పగులగొట్టారని ఆమె చెప్పారు. లక్ష రూపాయలు లేని కేసీఆర్‌కు లక్ష కోట్లు ఎలా వచ్చాయో ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు. కేసీఆర్ పెట్టిన కష్టాలను ఉద్యమస్ఫూర్తితో ఈటల ఎదుర్కొన్నారని ఆమె ప్రశంసించారు. హుజురాబాద్ ఫలితంతో కేసీఆర్ తన స్థాయిని దిగజార్చుకున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు.

ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా సీఎం కేసీఆర్‌ను వదలిపెట్టబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. ‘దళిత బంధు’ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వేలాది మందితో హైదరాబాద్‌లో ‘డప్పుల మోత’ నిర్వహిస్తున్నామని తెలిపారు. 

నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈ నెల 16న నిరుద్యోగులతో ట్యాంక్‌బండ్‌పై ‘మిలియన్‌ మార్చ్‌’ చేపడతామని, దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్‌ చేశారు. ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించినా, రాష్ట్రం వ్యాట్‌ను ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తగ్గించేదాకా ఉద్యమిస్తామని,  8న ఆందోళనలు చేపడతామని తెలిపారు.

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి జోస్యం చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపిచ్చారు.