హైద‌రాబాద్‌లో రూ.6.29 త‌గ్గిన పెట్రోల్ ధ‌ర‌

కేంద్ర ప్ర‌భుత్వం గ‌త బుధ‌వారం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించ‌డంతో దేశ‌వ్యాప్తంగా పెట్రో ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.6.29 త‌గ్గుద‌ల న‌మోదైంది. డీజిల్‌పై రూ.12.78 త‌గ్గింది. శుక్ర‌వారం న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.108.18గా, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.94.62గా ఉన్న‌ది. 

అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో క్రూడాయిల్ ధ‌ర గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా పెరుగుతూ వ‌చ్చింద‌ని, దాంతో దేశంలో పెట్రో ధ‌ర‌లు ప్ర‌తి రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా 10 నుంచి 20 పైస‌లు పెరిగాయ‌ని తెలంగాణ స్టేట్ పెట్రోల్ డీల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు విన‌య్ కుమార్ చెప్పారు. ఇకపై ఇదే కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు.

అందుకే కేంద్రం ఎక్సైజ్ సుంకం త‌గ్గించినందుకు ధ‌ర‌లు ఇప్పుడు స్వ‌ల్పంగా త‌గ్గినా.. క్రూడాయిల్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో కొద్ది రోజుల్లోనే మ‌రింత పెరుగుతాయ‌ని ఆయ‌న అంచనా వేశారు. కాగా, ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధ‌ర 81.36 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లుకుతున్న‌ది.

కేంద్రం చర్యకు కొనసాగింపుగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు కూడా విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను కొంతమేరకు తగ్గించడంతో, మిగిలిన రాష్ట్రాలపైనా కూడా ఆ విధంగా  తగ్గించమని వత్తిడి వస్తున్నది. కేవలం బిజెపి, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ఒడిశా ప్రభుత్వమే తగ్గించింది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంకు కొంతమేరకు వ్యాట్ తగ్గించాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది.

 పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు చెబుతున్నా  వెంటనే ధరలు తగ్గించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా,   కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందని, కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వందకోట్ల ఆదాయం కోల్పోనున్నందని చెబుతున్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.