బెదిరింపులతోనే బద్వేలులో వైసిపి గెలుపు

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని బెదిరించి ఓట్లు వేయించుకుని బద్వేలు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించిందని బీజేపీ నేత, మాజీ మంత్రి  కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బద్వేలులో వైసీపీ గెలుపు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా ఓ మచ్చగా మిగిలిపోతుందని స్పష్టం చేశారు. 
 
ఉప ఎన్నికతో బీజేపీకి ఓటింగ్‌ శాతం పెరిగిందని, దీంతో పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం పెరిగిదని ఆయన చెప్పారు. రాజధాని ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం మారినంత మాత్రాన ప్లాంట్‌ ఎక్కడికీ పోదని స్పష్టం చేశారు. ఉద్యోగుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది ఉండదని  హామీ ఇచ్చారు. 
 
ఇలా ఉండగా, రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు భయానక వాతావరణంలో జరగనున్నాయని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  ఎమ్మెల్సీ పివిఎన్  మాధవ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో వైసీపీ రిగ్గింగ్‌, బూత్‌ల స్వాధీనం వంటి చర్యలకు దిగిందని ఆరోపించారు. 
 
600 బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించారన్నారని దుయ్యబట్టారు. ప్రజలు వ్యతిరేకించినా బలవంతంగా ఓట్లు వేయించుకున్నారని చెబుతూ  రాబోయే ఎన్నికల్లోను ఇదే జరుగుతుందని హచ్చరించారు. దీనిపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని ప్రకటించారు. 
 
విశాఖపట్నంలో విలువైన ఆస్తులు తనఖా పెట్టారని పేర్కొంటూ చట్టసభల్లో బిల్లు పెట్టకుండా అలా చేయడం తప్పు అని స్పష్టం చేశారు. దీనికి గవర్నర్‌ను గ్యారంటీగా చూపడం మరీ దారుణమని మాధవ్ మండిపడ్డారు.