రాజకీయ ఉనికి కోసం `హిందుత్వం’ ఆశ్రయిస్తున్న చంద్రబాబు

దేశంలో తనను మించిన అసలు సిసలు లౌకికవాది లేరని అంటూ చాలాకాలం వామపక్షాలతో కలసి చెట్టపట్టాలు వేసుకొంటూ తిరిగిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం `హిందుత్వం’ ఆశ్రయిస్తున్నారు. బిజెపి నేతలకన్నా ముందే హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన సమయంలో నిరసనలు వ్యక్తం చేశారు. 

తాజాగా మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికల పక్రియను దీపావళి పర్వదినం నుండి ప్రారంభించడం పట్ల చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమీషన్, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హిందువుల పర్వదినం దీపావళి నాడు ఎన్నికల పక్రియ ఏమిటని మిగిలిన పార్టీలు కనీసం గమనించే లోగానే ఇదే ఇతర మతాల పండుగలు ఉంటె ఎన్నికల పక్రియ చేపట్టేవారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

ఈ విషయమై అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పగానే, దానికి తానా తందానా అన్న‌ట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింద‌ని అంటూ ఆరోపణ చేశారు. దీపావళి అయ్యాక ప్రక్రియ మొదలు పెడితే కొంపలు కూలిపోతాయా? అంటూ ఎన్నికల కమీషన్ ను నిలదీశారు. ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా కనీసం దీపావళి జరుపుకోనీయకుండా అదేరోజున నామినేషన్లు వేసేలా చేశార‌ని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వరుసగా ఎన్నికల పరాజయాలతో పార్టీ నాయకులు సహితం ముఖం చాటేస్తున్న సమయంలో, పోటీచేసి పరువు పోగొట్టుకోవడం ఏమిటంటూ బద్వేలు ఉపఎన్నికకు దూరంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు నిజంగా హిందువుల మనోభావాల గురించి ఆవేదన చెందుతుంటే అభినందించ వలసిందే.

కానీ, గతంలో ఎల్ కె అద్వానీ తన రథయాత్రలో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనను ఇంటికి ఆహ్వానించి, హారతి ఇచ్చి నాటి టిడిపి అధినేత ఎన్టీ  రామారావు స్వాతం పలగకగానే రాజకీయంగా ఏదో ప్రమాదం రానున్నట్లు ఖంగారు పడి, నాడు అద్వానీతో రామారావు అన్నమాటలను అనలేదని అంటూ పార్టీతో ప్రకటన జారీ చేయించింది చంద్రబాబు కాదా?

యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో తానే చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబు నాడు సిపిఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జాత్ చెప్పిన్నట్లు తలఊపడం తప్పా స్వతంత్రంగా వ్యవహరించారా? చంద్రబాబు వైఖరితో విసిగిపోయిన దేవెగౌడ ఆయన వద్దంటున్నా వినకుండా వెళ్లి రాజీనామా ఇవ్వలేదా?

గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని కోరడంతోనే తనపట్ల నరేంద్ర మోదీ ప్రధానిగా `కక్షసాధింపు’ వైఖరి ఆవలంభిస్తున్నారని అంటూ ఎన్డీయే నుండి వైదొలుగుతూ ఆరోపణలు చేయలేదా? తన అంచనాలు తప్పి, తిరిగి మోదీ ప్రధానిగా రావడం, రాష్ట్రంలో తన ప్రభుత్వం కూలిపోవడంతో ఖంగారు పడుతూ అప్పటి నుండి తిరిగి ప్రధానిని ప్రసన్నం చేసుకోవడం కోసం విఫల ప్రయత్నాలు చేయడం లేదా?

`రాజకీయ అవకాశవాదం’కు చిరునామాగా మారిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్యెల్యే సీట్లు ఇవ్వలేనివారికి, పార్టీలో అసంతృప్తిని కట్టడి చేయడం కోసం టిటిడి చైర్మన్ పదవులు ఇచ్చారు గాని,  దేవాలయ పవిత్రత కాపాడగలరనుకున్న వారిని ఎంపిక చేశారా? పారిశ్రామిక వేత్తలను టిటిడి బోర్డు సభ్యులుగా నియమించడం ప్రారంభించింది టిటిడి ప్రభుత్వం కాదా?

ఇప్పుడు మరింత విశృంఖలంగా, క్రైస్తవ అజెండాతో హిందూ దేవాలయాల పవిత్రతకు ముప్పు వాటిల్లే విధంగా, హిందువుల మనోభావాలను వీలున్నప్పుడల్లా గాయపరచి విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనడంలో సందేహం లేదు. కానీ `హిందుత్వ’ పలుకులు పలికినంత మాత్రం చేత చంద్రబాబు నిజాయతీని విశ్వసింపలేము.