భరతమాత రక్షణ కవచాలు మన జవాన్లు

మాతృభూమి రక్షణ కవచాలు మన వీర జవాన్లని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత సైనికులు కంటికి రెప్ప వేయకుండా దేశాన్ని కాపాడుతున్నందువల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని చెప్పారు. జమ్మూకశ్మర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో  దేశ సరిహద్దులను నిరంతరం కాపాడుతున్న సైనికుల‌తో క‌లిసి ప్రధాని దీపావ‌ళి పండుగ జ‌రుపుకున్నారు.
 
అక్క‌డ అమ‌ర జ‌వాన్‌ల స్మార‌కం వ‌ద్ద నివాళులు అర్పించారు. పుష్ప‌గుచ్ఛాలుంచి అంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం అక్క‌డ సైనికుల‌తో ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌ధాని మాట్లాడుతూ.. తాను 2014 నుంచి ప్ర‌తి ఏటా స‌రిహ‌ద్దుల్లో సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి పండుగ జ‌రుపుకుంటున్నాన‌ని గుర్తుచేశారు. ఎప్ప‌టిలాగే ఈసారి కూడా మీతో పండుగ చేసుకునేందుకు నౌషెరాకు వ‌చ్చాన‌ని సైనికుల‌ను ఉద్దేశించి చెప్పారు. 
 
‘నేను ఇక్క‌డికి ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా. సైన్యం కోసం 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకొచ్చా. ప్రతి దీపావళి సైనికులతో జరుపుకుంటున్నా. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉంది. సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు’ అని తెలిపారు. 
 
ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని చెబుతూ సర్జికల్‌ స్ట్రైయిక్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణం, దేశానికి సైన్యం సురక్షా కవచం అంటూ ప్రశంసించారు.  ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గురవారం ఉదయం జమ్మూ వచ్చారు. అక్కడి నుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు నియంత్రణ రేఖ వద్దకు వచ్చారు. 
 
మోదీ ఆర్మీ దుస్తులు ధరించి, తలపై టోపి పెట్టుకొని ఆర్మీ శిబిరాలను సందర్శించారు. జవాన్లతో కలిసి ”భారత్ మాతా కీ జై” అంటూ ప్రధాని గొంతు కలిపారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, సర్జికల్ దాడుల్లో నౌషెరా సెక్టార్ బ్రిగేడ్ పోషించిన కీలక పాత్రను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. 
 
తీవ్రవాదం విస్తరణకు ఎన్నో ప్రయత్నాలు ఇక్కడ జరిగాయని, కానీ , సర్జికల్ దాడులతో బలగాలు గట్టి సమాధానం ఇచ్చాయని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచం, యుద్ధ పద్ధతులకు అనుగుణంగా మిలటరీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటూ వెళ్లడం తప్పనిసరని తెలిపారు. 
 
గతంలో రక్షణరంగ కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చేదని, కానీ తమ ప్రభుత్వం దేశీయంగా సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలను మెరుగుపరిచిందని చెప్పారు. అంత‌కుముందు ప్ర‌ధాని దేశ ప్ర‌జలంద‌రికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.
 
రోమ్, యూకేలలో 5రోజులపాటు పర్యటించి కాప్ 26 వాతావరణ సదస్సులో పాల్గొని వచ్చిన మోదీ గురువారం సరిహద్దులకు వచ్చారు. ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకునే అలవాటును కొనసాగిస్తూ గురువారం ఉదయాన్నే మోదీ నౌషెరా పట్టణానికి చేరుకున్నారు. 

2014లో ప్రధాని అయినప్పటి నుంచి ప్రధాని మోదీ దీపావళి రోజున సరిహద్దు ఔట్‌పోస్టులకు నిత్యం వస్తుంటారు. అంతకుముందు ఆయన ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రధాని మోదీ 2019లో కూడా రాజౌరీలో సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. 

ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఈ ప్రాంతాలపై వైమానిక నిఘా పెట్టారు. జమ్మూ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ప్రస్తుతమున్న భద్రతా పరిస్థితుల గురించి ప్రధానికి ఆర్మీ చీఫ్ జనరల్ వివరించారు