కేసీఆర్ బొమ్మపై కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి

తాను ఇంతకు ముందు కేసీఆర్‌ బొమ్మ పెట్టుకుని పోటీ చేసినప్పటి కంటే ఈ ఎన్నికలోనే ఎక్కువ ఓట్లు సాధించానని  మాజీ మంత్రి, హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థిగా గెలుపొందిన ఈటెల రాజేందర్ తెలిపారు. ఉప ఎన్నికలో హుజూరాబాద్‌ ప్రజలను అన్ని రకాలుగా భయబ్రాంతులకు గురి చేశారని, కుట్రలు చేసిన వారు కుట్రలతోనే నాశనమవుతారని రుజువైందని చెప్పారు.
 అధికార పార్టీ బెదిరింపులను లెక్క చేయకుండా తనకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు తన విజయాన్ని అంకితమిస్తున్నట్లు రాజేందర్‌ ప్రకటించారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీరదని పేర్కొంటూ నియోజకవర్గ ప్రజలంతా కలిసికట్టుగా ఉండి కేసీఆర్‌ చెంప చెళ్లుమనిపించారని చెప్పారు.
 
అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా, నియోజకవర్గ ప్రజలు గుండెను చీల్చి, తమ ఆత్మను ఆవిష్కరించి తనను గెలిపించారంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు వచ్చిన  కష్టం శత్రువుకు కూడా రావొద్దని స్పష్టం చేశారు. కేసీఆర్‌ అహంకారంపై అంతిమంగా ప్రజలే గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. బెదిరింపులను లెక్క చేయకుండా  టీఆర్‌ఎస్‌  కు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
ప్రపంచ చరిత్రలో ఇలాంటి ప్రలోభాలతో కూడిన ఎన్నిక ఎక్కడా జరగలేదని ఈటెల చెప్పారు. తనకు ఒక్క ఓటూ పడకూడదన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేసి.. విఫలమయ్యారిని తెలిపారు. పోలీసులే ఎస్కార్ట్‌ ఇచ్చి డబ్బులు పంపిణీ చేయించారని ఆరోపించారు. కళ్ల ముందు రూ.లక్షలు కనిపించినా తిరస్కరించి అన్ని కుల సంఘాల వారు తన గెలుపునకు సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు.
కులాల వారీగా చీలిక తెచ్చి.. తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినా హుజూరాబాద్‌ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని గెలిపించారని గుర్తు చేశారు. తాను పార్టీలు మారే వాడిని కాదని, తన జీవితం తెరిచిన పుస్తకమని చెబుతూ తనను టీఆర్‌ఎస్‌ నుంచి వెళ్లగొట్టిన తర్వాత బీజేపీ అక్కున చేర్చుకుందని గుర్తు చేసుకున్నారు.
కేంద్ర మంత్రి అమిత్‌షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు రాష్ట్ర, జిల్లా నాయకులు తనకు సంపూర్ణ సహకారం అందించారని చెప్పారు. ఓయూ, కేయూ విద్యార్థులతోపాటు ఎంతో మంది సోషల్‌ మీడియా వేదికగా కేసీఆర్‌ కుయుక్తులను చీల్చి చెండాడారని చెప్పారు. దళిత బంధు కింద రూ.10 లక్షలు పదిసార్లు ఇచ్చినా తనను మరువబోమని దళిత ప్రజలు చాటి చెప్పారని అభినందనలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రుణపడి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.  ఎన్నికల కోడ్ సాకుగా చూపి కేసీఆర్ ఆపేసిన దళిత బంధుతో పాటు, ఉప ఎన్నికి సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు ప్రారంభించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.  

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారని చెప్పారు. ఓటుకు రూ.6 వేల చొప్పున పంపిణీ చేశారని ఆరోపించారు. ధన ప్రలోభాలతో గెలవాలని చూశారని, అయితే టీఆర్ఎస్ అబద్ధాలను, జిమ్మిక్కులను ప్రజలు నమ్మలేదని స్పష్టం చేశారు. 

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు టీఆర్‌ఎస్‌ పతనానికి నాంది అని పేర్కొంటూ  పేద ప్రజల ఆప్తుడైన ఈటలకు భారీ మెజార్టీ అందించి ధర్మం, న్యాయాన్ని గెలిపించారని పేర్కొన్నారు. పిట్ట కథలతో రాజకీయాలు చేసే యత్నం బెడిసికొట్టగా, ఎన్నికల ముందు ఇచ్చిన మంజూరు చేసిన నిధులు నిలిపివేసే యత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. 

రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ వాటిని కేంద్రంపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తోందని, వరిసాగుపై రాష్ట్ర రైంతాంగాన్ని అయోమయానికి గురి చేస్తోందని విమ్శచారు. రాష్ట్రంలో గడీల పాలనకు తెరదించుతూ ప్రజావ్యతిరేక విధానాలకు చరమగీతం పాడడం బీజేపీతోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని సంజయ్ తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో రెండు చోట్ల పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. 

ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌ వీడి, ప్రజాక్షేత్రంలో రావాలని సంజయ్ హితవు చెప్పారు. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో నిరుద్యోగుల నోటిఫికేషన్లపై ఇచ్చిన అల్టిమేటమ్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 12న నిరుద్యోగ మిలియన్‌ మార్చ్‌ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. రెండో విడత పాదయాత్ర ఈ నెల 21 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు