జమ్మూలో చిక్కుకున్న లారీ డ్రైవర్లను కాపాడిన తమిళిసై

జమ్మూలో మంచువర్షానికి చిక్కుకుని రెండువారాలుగా ఆహారం  లేకుండా అలమటించిన రాష్ట్రానికి చెందిన 18 మంది లారీ డ్రైవర్లను తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదుకున్నారు. ఆమె చొరవతో ఆ 18 మంది ప్రాణా లతో బయటపడ్డారు. 
 
అక్టోబరు 12వ తేదీన పాలక్కాడు నుంచి 18 లారీల్లో కేబుళ్లను ఎక్కించుకుని సేలం, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన 18 మంది డైవర్లు లడాక్‌కు బయలుదేరారు. అక్టోబరు 20న ఆ లారీలు శ్రీనగర్‌ చేరుకున్నాయి. అప్పటికే అక్కడ దట్టంగా మంచువర్షం కురుస్తోంది. అన్నివైపులా దట్టమైన మంచు కప్పుకుని రహదారులు మూతపడ్డాయి. 
 
మంచు కారణంగా ఆ మార్గాలలోని హోటళ్ళు, దుకాణాలు కూడా మూసివేశారు. దీంతో తమిళ లారీడ్రైవర్లు ఆహారం లభించక అల్లాడిపోయారు. ఆ లారీ డ్రైవర్లు తమ దుస్థితిని సెల్‌ఫోన్‌లో కుటుంబీకులకు పంపిన వీడియో సామాజిక ప్రసారమాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. 
 
ఆ దృశ్యాలను చూసిన తమిళిసై తక్షణం వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఏడీసీ తుషార్‌శ్రీని పురమాయించారు. ఆమె చొరవతో జమ్మూలోని సైనికాధి కారులు ఆ డ్రైవర్లను చేరదీసి సైనికశిబిరాల్లో బస కల్పించారు. అంతేగాక వారికి ఆహారం అందిస్తున్నారు. ఈ వివరాలను సేలం ఆత్తూరుకు చెందిన డ్రైవర్‌ సురేష్‌ తన కుటుంబీకులకు చేరవేయడంతో సమాచారం బయటకు పొక్కింది. దీంతో డ్రైవర్ల కుటుంబాలన్నీ తమిళిసైకి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి.