ప్రగతి భవన్ అహంకారాన్ని బొందపెడదాం

ప్రగతి భవన్ అహంకారాన్ని బొందపెడదాం..హుజూరాబాద్ ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాం” అంటూ మాజీ మంత్రి, బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా భావోద్వేగానికి గురైయ్యారు. కమలాపూర్‌లోని 262వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన భార్య జమునతో కలిసి ఓట్ వేసిన అనంతరం మాట్లాడుతూ ‘’సాదుకున్నా మీరే, చంపుకున్నా మీరే. ధర్మం గెలుస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. 
 
హుజురాబాద్ ప్రజలు తమ గుండెల్లోని బాధలను ఓట్ల రూపంలో చూపిస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని తెలిపారు.  ఉపఎన్నిక కోసం కొన్ని వందల కోట్లను అధికార టీఆర్ఎస్ ఖర్చుచేసిందని ఈటల మండిపడ్డారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని చెప్పారు.
ప్రభుత్వ జీవోల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టారని ఆయన నిప్పులు చెరిగారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి డబ్బును, మద్యాన్ని పంచిపెడుతున్నారని ఈటల ఆరోపించారు. ప్రజల ప్రేమ, అభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవని చెప్పారు.
తెలుగు రాష్ట్రాలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతున్నది. కాగా, వీణవంక మండలం గన్ ముక్కుల పోలింగ్ బూత్ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకుడు కౌశిక్ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్‌ రెడ్డిని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి చక్కబడింది.
పోలింగ్ బూత్‎లో టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు నిలదీశారు. దీంతో పోలీంగ్ బూత్ వద్ద ఉద్రిక్తత వాతావరణానికి దారి తీసింది. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేయడం ఏంటీ అంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గనుముక్కులలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా తనకు ఏజెంట్ పాస్ ఉందని కౌశిక్ రెడ్డి చెప్పగా… స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జమ్మికుంట, కోరుగర్లులో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గల 176వ బూత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికేతరుల ప్రచారాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
జమ్మికుంట మండలం శాయంపేటలో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుండగా బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఓ న్యూస్ చానల్ కు చెందిన ఫేక్ ఐడీ కార్డులతో టీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సదరు న్యూస్ చానల్‎కు చెందిన ఐడీ కార్డులను బీజేపీ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. 
 
మీడియా కార్డుతో తిరుగుతున్న ఆ వ్యక్తిని వరంగల్ కు చెందిన రిపోర్టర్ దేవేందర్ రెడ్డి గుర్తించారు. ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్నారని తెలుస్తోంది. కాగా.. ఆ రిపోర్టర్ జేబులో భారీ ఎత్తున నగదు ఉండడంతో బీజేపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
 
కావాలనే తమ ఓట్లు తీసేశారని కమలాపూర్ కు చెందిన ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ‘గతంలో సర్పంచ్, ఎమ్మెల్యే ఎన్నికలకు ఎన్నోసార్లు ఓటేశాం. అయితే మేం ఈటల రాజేందర్ కు ఓటేస్తామని మా ఆలుమగల ఓట్లు తీసేశారు’ అని ఆమె ఆరోపించారు. `మాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు రాకున్నా బాధలేదు కానీ, ఓటు వేయనందుకు బాధపడుతున్నాం. ఓటు వేయకపోవడంతో చచ్చినవాళ్లతో సమానం అయినం. నా ఓటు నాకు కావాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.  
 తమకు డబ్బులిస్తేనే ఓటేస్తామని జమ్మికుంట మండలం రాచపల్లి గ్రామస్తులు సర్పంచ్ ఇంటిముందు నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారని.. తమకు కూడా డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామని కొంతమంది ఓటర్లు నిరసన తెలిపారు. దాంతో పోలీసుల సహకారంతో సర్పంచ్ నిరసనకు దిగిన ఓటర్లను వెనక్కి పంపించారు.