పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు బ్రేక్ 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్‌జిటి న్యాయ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్య నిపుణులు కె.సత్యగోపాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. 
 
2016లో ట్రిబ్యునల్‌ అనుమతుల మేరకే తాగునీటి ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని పేర్కొంది. తాగునీటికి 7.5 టిఎంసిలే అవసరమైనప్పటికీ, 90 టిఎంసిల సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని, అందులో సాగునీటి పనులు కూడా ఉన్నాయని తాము నియమించిన సంయుక్త కమిటీ తేల్చిందని తెలిపింది. 
తెలంగాణకు చెందిన ఇద్దరు సభ్యులు మినహా సంయుక్త కమిటీలోని సభ్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం పర్యావరణ ప్రభావం మదింపు నోటిఫికేషన్‌- 2006 ఆధారంగా పర్యావరణ అనుమతులు పొందే వరకు ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది.

పాలమూరు ప్రాజెక్టులో రిజర్వాయర్లు అంతర్భాగమని, ముఖ్యంగా ఇవి సాగునీటి ప్రాజెక్టులో భాగమని, ఇవి లేకుండా సాగునీటి ప్రయోజనాలు నెరవేరవని ఎన్జీటీ గుర్తించింది. ప్రధానంగా 102 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయడానికి పంపులను బిగిస్తున్నట్లు సంయుక్త కమిటీ తెలిపిందని గుర్తు చేసింది. పర్యావరణ అనుమతుల కోసం చేసిన దరఖాస్తులోనూ ఈ ప్రాజెక్టులో సాగునీటి పనులు ఉన్నట్లు పేర్కొని ఉందని ధర్మాసనం వెల్లడించింది. 

కరువు ప్రాంతాలకు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటి ప్రయోజనాలు కలుగుతాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ.. పర్యావరణ అనుమతులు వర్తించే సాగునీటి పనులు ఉన్నప్పుడు పర్యావరణ చట్టాలను ఉల్లంఘించరాదని సూచించింది.

కాగా, పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ స్టే ఇవ్వటానికి కేసీఆర్‌ వైఫల్యమే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. పాలమూరుపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేకపోవటంతోనే ఇలా జరిగిందని ఆమె ధ్వజమెత్తారు. డీపీఆర్‌లు ఇవ్వకపోవటం, ఎన్జీటీ ముందు బలమైన వాదనలు వినిపించకపోవటం వల్లనే స్టే వచ్చిందని ఆమె మండిపడ్డారు.