
ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డిపై సిబిఐ దాఖలు చేసిన ఆదాయంకు మించిన ఆస్తులు కేసులు వచ్చే వారం నుండి రోజువారీ విచారణ సిబిఐ ప్రత్యేక కోర్ట్ లో చేపట్టనున్న సమయంలో సిబిఐ లీగల్ రిటైనర్ గా జగన్ న్యాయవాదిని నియమించడంతో వివాదం చెలరేగుతుంది.
బిఎంఎస్ సీనియర్ నాయకుడైన ఒక ప్రముఖ న్యాయవాదిని ఈ పదవిలో నియమించగలరని అందరూ భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఇటువంటి నియామకం ఏ విధంగా జరిగిందో అని పలు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వంకు అపఖ్యాతి కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ నియామకం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ తరఫున గతంలో సీబీఐ కేసులు వాదించిన న్యాయవాది పి.సుభాష్ ని ఈనెల 18న సీబీఐ హైకోర్టులో తన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (లీగల్ రిటైనర్)ను నియమించుకుంది. ఆయన హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్లీడర్ (జీపీ) కూడా కావడం గమనార్హం. సీబీఐ, ఈడీ కేసులలో జగన్ తరఫున వాదించే లీగల్ టీమ్‌లో పి.సుభాష్ ఒకరు.
ప్రభుత్వ ప్లీడరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధమైన కేసు విచారణలలో పాల్గొనకూడదని, న్యాయ సలహాలు కూడా ఇవ్వకూడదని, పూర్తిగా, తనకు అప్పగించిన కేసులపైనే దృష్టిపెట్టాలని, అమరావతి ప్రధాన కేంద్రంగానే పనిచేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఏపీలో సీబీఐ దర్యాప్తు తీసుకున్న కేసుల్లో చాలావరకు ప్రభుత్వం లేదా ప్రభుత్వ పెద్దలు దోషులుగా ఉన్నారు. న్యాయమూర్తులను దూషించిన కేసులోనూ అధికార పార్టీకి చెందిన వారే నిందితులు. పి.సుభాష్ ఈ నిందితులకు వ్యతిరేకంగా బలమైన వాదనలు సిద్ధం చేయగలరా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘సీబీఐ తీరు అనుమానాస్పదంగా ఉంది’… న్యాయమూర్తులపై దూషణల కేసులో సీబీఐ వ్యవహార శైలిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి! సీబీఐ తీరు నిందితులకు సహకరిస్తున్నట్లుగా ఉందని ఉన్నత న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది. ఏకంగా… సీబీఐ ఎస్పీని కోర్టుకు పిలిచి ఈ మధ్యనే అక్షింతలు వేసింది. అటువంటప్పుడు ఇటువంటి నియామకం జరగడం సిబిఐ పనితీరుపట్ల అనుమానాలను రేకెక్తినుంచే అవకాశాలు కలుగుతున్నాయి.
ఈ విషయమై సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ రాఘురామ కృష్ణంరాజు లేఖరాశారు. న్యాయవాది పి.సుభాష్జ జగన్ అక్రమాస్తుల కేసులను వాదించారని తెలిపారు. వైస్ వివేకానందరెడ్డి హత్య, ప్రముఖ డాక్టర్ సుధాకర్ అనుమానాస్పద మృతి సహా, వైసీపీ నేతలు న్యాయమూర్తులను దూషించడంపై కూడా సీబీఐ విచారణ జరుపుతోందని గుర్తు చేశారు.
ఇలాంటి విచారణ నేపథ్యంలో సీబీఐ తరపున పి.సుభాష్‌ను స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించడం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లెలా చేస్తోందని ఆయన ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై దూషణల కేసును నేరుగా పర్యవేక్షణ చేయమని హైకోర్టు సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించిందని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తరపున పని చేసిన న్యాయవాదిని సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ నియమించడం అనేక సందేహాలకు, అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. నిష్పక్షపాక్షత, పారదర్శకత దర్యాప్తు కోసం సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా పి.సుభాష్‌ని తొలగించాలని ఆ లేఖలో ఆయన డిమాండ్ చేశారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి