
కాంగ్రెస్ అసమర్థత వల్లే మోదీ బలం పెరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దేశంలోని రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకోవడం లేదని, అందుకే బీజేపీ బలం మరింతగా పెరిగిందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు.
గోవాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్‌తోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆమె మండిపడ్డారు. ‘ఢిల్లీ చేసే దాదాగిరీ ఇక చెల్లదు’ అని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే దేశంలో పరిస్థితులు ఇలా తగలడ్డాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు .ఒకరు నిర్ణయం తీసుకోలేకపోతే, దానివల్ల దేశం ఎందుకు బాధపడాలని ఆమె ప్రశ్నించారు
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆమె.. కాంగ్రెస్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ విషయంలో నేను ఇప్పుడు ఏమీ మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే వాళ్లు రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కాంగ్రెస్ కారణంగా మోదీ బలం రోజురోజుకూ పెరిగిపోతోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీతో పోరాడే అవకాశం కాంగ్రెస్‌కు గతంలో వచ్చిందని, కానీ వాళ్లు దాన్ని అందిపుచ్చుకోలేదని తెలిపింది. కానీ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా పోరాడిందని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రాలు బలంగా ఉన్నప్పుడే కేంద్రం బలంగా ఉంటుందని, కాబట్టి స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో ఆమె సమావేశమయ్యారు. వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇంకా ఇతర చిన్నాచితకా పార్టీలు కలిసి పోటీచేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.
బీజేపీయేతర శక్తులన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి ఆ పార్టీని అంతటా ఓడించడమే లక్ష్యంగా తాము పోరాడుతామని మమతాబెనర్జి ఈ సందర్భంగా చెప్పారు. కొద్దిసేపటి క్రితమే గోవా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో మాట్లాడానని, కలిసి పోటీచేసే విషయంపై ఇద్దరం చర్చించామని ఆమె తెలిపారు.
అయితే ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆయన ఇష్టమని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలి పోకూడదనేది తన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. కాగా, విపక్షాలు ఐక్యంగా పోరాడితేనే బీజేపీని నిలువరించవచ్చని ఈ సందర్భంగా విజయ్ సర్ధేశాయ్ స్పష్టం చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీతో కలిసి పనిచేసేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.
గోవా అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలున్న సర్ధేశాయ్ పార్టీ గోవా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో గోవా ఫార్వర్డ్ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుని విపక్ష కూటమి బలోపేతానికి పనిచేసే పార్టీతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?.. చర్చలంటూ గగ్గోలు!
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!