పునీత్ పార్దీవ‌దేహానికి క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్‌, సీఎం నివాళి

గుండెపోటుతో మరణించిన క‌న్న‌డ న‌టుడు పునీత్ రాజ్‌కుమార్  పార్టీవ‌దేహానికి ఇవాళ క‌ర్నాట‌క రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చండ్ గెహ్లాట్‌, సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మైలు పుష్ప నివాళి అర్పించారు. 46 ఏళ్ల పునీత్ రాజ్‌కుమార్ శుక్ర‌వారం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ప్ర‌స్తుతం కంఠీర‌వ స్టేడియంలో అభిమానుల సంద‌ర్శ‌న కోసం రాజ్‌కుమార్ మృత‌దేహాన్ని అక్క‌డ ఉంచారు. 
 
క‌డ‌సారి చూపు కోసం కంఠీర‌వ స్టేడియానికి రాజ్‌కుమార్ ఫ్యాన్స్ పోటెత్తారు. ఇవాళ సాయంత్రం 6.30 నిమిషాల‌కు రాజ్‌కుమార్ పార్టీవ‌దేహానికి అధికార లాంచ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు రాజ్‌కుమార్ కూతురు అమెరికా నుంచి వ‌స్తోంది. 
 
ఆమె ఇవాళ మ‌ధ్యాహ్నం 1.30 నిమిషాల‌కు ఢిల్లీ చేరుకుంటుంది. ఆ త‌ర్వాత సాయంత్రం బెంగుళూరుకు రానున్న‌ది. న‌టుడు రాజ్‌కుమార్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, క్రీడాకారులు, రాజ‌కీయ‌వేత్త‌లు షాక్ వ్య‌క్తం చేశారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు సహితం నివాళులు అర్పించారు. పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన బాలకృష్ణ, ప్రభుదేవా  కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం పునీత్‌ సోదరుడు శివరాజ్‌కుమార్‌ని పరామర్శించారు. 
 
బాలకృష్ణతోపాటు నరేశ్‌, శివబాలాజీ, ప్రభుదేవా సైతం నివాళులర్పించారు. ఇక తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా కంఠీర‌వ స్టేడియానికి వెళ్లి త‌న స్నేహితుడికి నివాళులు అర్పించారు. స్నేహితుడిని అలా చూసి క‌న్నీరు కూడా పెట్టుకున్నారు.