
కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుంభకోణాలకు పర్యాయపదమని, ఈ పార్టీ నాయకులు తామిచ్చిన వాగ్దానాలను ఏనాడూ పూర్తిచేయరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ‘ఘసియారి కళ్యాణ్ యోజన’ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీలు చేసిన, నెరవేర్చిన హామీలపై బహిరంగ చర్చకు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. మ్యానిఫెస్టోలో పెట్టిన దాదాపు 85 శాతం వాగ్దానాలు పూర్తిచేసినట్లు తెలిపారు.
‘అవినీతి, కుంభకోణాలకు కాంగ్రెస్ పర్యాయపదంగా మారింది. ఏ రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా ఆ పార్టీ నేతలు పట్టించుకోరు. కాంగ్రెస్ ఎప్పుడూ తన వాగ్దానాలను తుంగలో తొక్కుతుంది. కాంగ్రెస్ బుజ్జగింపులు మాత్రమే చేస్తుంది. ఉత్తరాఖండ్‌కు ఎలాంటి సంక్షేమ పనులు చేపట్టలేదు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు.
పేదల సంక్షేమం, సుపరిపాలన కేవలం నరేంద్ర మోదీ నేతృత్వంలో బిజెపి మాత్రమే ఇవ్వగలదని స్పష్టం చేశారు. కరోనా, రాష్ట్రంలో వరదలు వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేతలు కనిపించకుండా పోయారని, అదే, ఎన్నికలు దగ్గర పడగానే బయటకు వచ్చి మీడియా సమావేశాలు ప్రారంభిస్తున్నరని ఆయన ఎద్దేవా చేశారు.
మోదీ ప్రభుత్వం హయాంలో ఉత్తరాఖండ్ లో రూ 85,000 కోట్ల వ్యయంతో రహదారులు, రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగినదని చెబుతూ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఏమి చేసిందే చెప్పాలని సవాల్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 5వ తేదీన కేదార్‌నాథ్ వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కోవిడ్, వరదల సమయంలో కాంగ్రెస్ ఏమైందో తెలియదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
“హరీష్ రావత్‌ను (మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత) నేను సవాలు చేస్తున్నాను. ఎన్నికల మేనిఫిస్టోలో ఇచ్చిన వాగ్దానాలను ఎవరు అమలు చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన 85 శాతం హామీలను బీజేపీ నెరవేర్చింది” అని అమిత్‌షా స్పష్టం చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని, కాంగ్రెస్ హయాంలో హైవేను దిగ్బంధించి, నమాజ్‌కు అనుమతి ఇచ్చారంటూ కొందరు తన దృష్టికి తెచ్చారని ఆయన చెప్పారు.
ప్రకృతి విపత్తు సంభవిస్తుందని తెలియగానే, చార్ ధామ్ యాత్రను నిలిపేశామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆదేశాలు ఇవ్వడం వల్ల, యాత్రికుల ప్రాణాలను కాపాడినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారంనాడు అమిత్ షా పర్యటించారు. 70 మంది సభ్యుల ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకుంది.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి