చైనా వస్తువుల బహిష్కరణతో దీపావళికి రూ 50 వేల కోట్ల నష్టం 

చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని భారత్ లో పెరుగుతున్న సామాజిక ఉద్యమాల ఫలితంగా ఆ దేశానికి భారీ నష్టం జరుగుతున్నది. ప్రస్తుత దీపావళి సీజన్‌లో చైనా వస్తువులను భారత వ్యాపారులు నిషేదించడంతో డ్రాగన్ దేశ ఎగుమతిదారులు కొన్ని వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ దీపావళికి చైనా సరకులను బహిష్కరించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వ్యాపారులకు పిలుపునిచ్చింది. దీంతో చైనాకు సుమారు రూ 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు సీఏఐటీ తెలిపింది.  
ఇటీవల కాలంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, దీని ప్రభావంతో భారతీయ వస్తువులకు డిమాండ్‌ను పెరుగుతున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇటీవల 20 ముఖ్యమైన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్‌లు ఇవ్వలేదని తేలిందని ఆయన వెల్లడించారు.
తాజా పరిణామంతో భారతీయ వినియోగదారుల నేరుగా దేశీయ వస్తువుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీపావళి అమ్మకాల ద్వారా భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.2 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా సీఏఐటీ చైనీస్ వస్తువులను బహిష్కరణకు పిలుపునిచ్చింది. 

సాధారణంగా రక్షా బంధన్ నుండి ప్రారంభమై నూతన సంవత్సరం వరకు పండుగలకు భారతీయ వర్తకులు ప్రతి ఏడాది రూ 70,000 కోట్ల విలువైన చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటుంటారు. అయితే ఈ సంవత్సరం రక్షా బంధన్ సమయంలోనే రూ 5,000 కోట్ల మేరకు చైనా ఉత్పత్తులకు నష్టం జరిగింది. వినాయక చవితికి మరో రూ 500 కోట్ల మేరకు నష్టం జరిగింది. 

గత ఏడాది సరిహద్దులో గాల్విన్ లోయవద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మన సైనికులు 20 మంది చనిపోయినప్పటి నుండి చైనా వస్తువులను బహిష్కరించాలని పలు సామజిక సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. దానితో భారత వినియోగదారుల ధోరణులతో పెద్ద ఎత్తున మార్పులు వచ్చిన్నట్లు స్పష్టం అవుతున్నది. 

సాధారణంగా దీపావళి సీజన్లో లో దేశ వ్యాప్తంగా మార్కెట్లు రద్దీగా ఉంటాయి. పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. దానితో చైనా వస్తువుల దిగుమతులు తగ్గిపోతుండడంతో భారతీయ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం లభించగలదని భావిస్తున్నారు. 

అయితే టపాకాయల పరిశ్రమ మాత్రం సంక్షోభం ఎదుర్కొంటున్నది.  పలు రాష్ట్ర ప్రభుత్వాలు టపాకాయలు పండుగకు వాడడాన్ని నిషేధించడం, సుప్రీం కోర్ట్ సహితం కొన్ని ఆంక్షలు విధించడంతో పరిమితంగానే ఈ వ్యాపారం జరిగే అవకాశాలున్నాయి. ఒడిశా, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు పాక్షికంగానో, పూర్తిగానో ఈ పండుగకు టపాకాయలు కాల్చడాన్ని నిషేధించడం తెలిసిందే. 

ఒక వంక కరోనా మహమ్మారి టపాకాయల పరిశ్రమకు ఇబ్బందులు తీసుకొస్తుంటే ఈ ఆంక్షలు సహితం తీవ్ర ప్రతీకలు ప్రభావం చూపుతున్నాయి. ఒక అంచనా ప్రకారం గత ఏడాది దేశంలో రూ 3,000 కోట్ల విలువైన టపాకాయలు ఉత్పత్తి కాగా, ఈ సంవత్సరం సగానికి సగం తగ్గిపోవచ్చని భావిస్తున్నారు. 

గత ఏడాది నవంబర్ లో లోకల్ సర్కిల్స్ దేశ వ్యాప్తంగా 204 జిల్లాల్లో జరిపిన సర్వేలో 71 శాతం మంది ప్రజలు తాము ఉద్దేశ్యపూర్వకంగా చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేశారు. చైనా ఉత్పత్తుల మధ్య భారత దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన చైనా పరిశ్రమలు తమ ఉత్పతులపై “చైనాలో తయారీ” అని కాకుండా “పి ఆర్ సి లో తయారీ” అని ముద్రిస్తూ మన వినియోగదారులను గందరగోళంకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నాయి.