వచ్చే ఏడాది చివరకు 5 బిలియన్‌ టీకాల ఉత్పత్తి

కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటానికి తమ వంతు సాయంగా వచ్చే ఏడాది చివరి నాటికి 5 బిలియన్‌ కోవిడ్‌ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ  హామీనిచ్చారు. జి 20 దేశాల సదస్సులో పాల్గన్న ఆయన మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో సహకారం విషయంలో ‘ఒకటే ప్రపంచం, ఒకటే ఆరోగ్యం’గా ఉండాలని సూచించారు. 

భారత్ టీకాలు ప్రపంచంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించగలవని ఆశాభావం వ్యక్తం చేస్తూ అందుకు భారత్ లో తయారవుతున్న టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరితగతిన గుర్తింపవలసి ఉన్నదని ఆయన చెప్పారు. 

టీకా పరిశోధన, తయారీని పెంచడంలో మేము మా పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నాము. తక్కువ వ్యవధిలో, మేము భారతదేశంలో ఒక బిలియన్ వ్యాక్సిన్ మోతాదులను అందించాము. ప్రపంచ జనాభాలో ఆరవ వంతు మందిలో సంక్రమణను నియంత్రించడం ద్వారా, ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడంలో భారతదేశం కూడా దోహదపడింది. వైరస్ మరింత మ్యుటేషన్ అయ్యే అవకాశాలను కూడా తగ్గించింది” అని ప్రధాని వివరించారు.

‘గ్లోబల్‌ ఎకనమీ అండ్‌ గ్లోబల్‌ హెల్త్‌’ సెషన్‌లో అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేయడం, వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌పై పరస్పర విధానాలు వంటి సమస్యలను లేవనెత్తారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా చెప్పారు. గ్లోబల్‌ ఫైనాన్స్‌ ఆర్కిటెక్చర్‌ను మరింత స్వేచ్ఛగా, న్యాయంగా తీసుకువచ్చేందుకు కనీస కార్పొరేట్‌ పన్నుకు 15 చొప్పున తీసుకు రావాలని జి 20 నిర్ణయాన్ని మోదీ  స్వాగతించారు. 

కంపెనీలు ఉన్న దేశాల్లో కొంత మొత్తంలో పన్ను చెల్లించేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ష్రింగ్లా చెప్పారు. పన్నుల ఎగవేతను కొంత మేర అరికట్టేందుకు 2014లోనే కనీస కార్పొరేట్‌ పన్నుల అంశాన్ని ప్రధాని మోదీ  తొలిసారిగా ప్రతిపాదించారని పేర్కొనడం గమనార్హం.

కరోనా మహమ్మారి తలెత్తిన తర్వాత మొదటిసారిగా జి 20దేశాల అధినేతలు శనివారం రోమ్ లో  సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, కోవిడ్‌ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రపంచవ్యాప్తంగా కనీస కార్పొరేట్‌ పన్ను రేటు వంటి అంశాలు ఈ సమావేశ అజెండాలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. రోమ్‌లోని నువోలా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటైన ఈ సదస్సుకు విచ్చేసిన జి-20దేశాల అధినేతలకు ఇటలీ ప్రధాని మారియో డ్రాగి స్వాగతం పలికారు. 

రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా నేత జిన్‌పింగ్‌ ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు. శనివారం ఉదయం ప్రారంభ సమావేశం ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా దృష్టి పెట్టింది. మరోవైపు ఇరాన్‌ అణు కార్యక్రమంపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలను చర్చించేందుకు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాధినేతలు విడిగా సమావేశమయ్యారు. 

కాలుష్య కారక వాయువులను అరికట్టడానికి తక్షణమే అత్యవసర చర్యలు తీసుకోని పక్షంలో తీవ్ర పర్యవసానాలు ఎదురవగలవని హెచ్చరికలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతోంది.

నిరుపేద దేశాలకు మరిన్ని వ్యాక్సిన్లు అందాలని, ఇందుకోసం మరింత ముమ్మరంగా ప్రయత్నాలు జరగాలని ఇటలీ నేత డ్రాగి పిలుపిచ్చారు. సంపన్నదేశాల్లో దాదాపు 70 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, పేద దేశాల్లో 3 శాతం మందే వ్యాక్సిన్‌ తీసుకోగలిగారని గుర్తు చేశారు. ఇది నైతికంగా ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.  ఈ అసమానతలను పరిష్కరించే దిశగా బహుముఖ సహకారం కావాలని కోరారు. 

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 80 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి జి-20 కీలకమైన హామీలు పొందాలని ఇటలీ ఆశిస్తోందని చెప్పారు. అంతే స్థాయిలో కాలుష్య కారకాలకు కూడా ఈ దేశాలు కారణమవుతున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. 

బైడెన్‌తో మోదీ  భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సహా పలువురు ప్రపంచ నేతలతో భేటీ అయ్యారు. పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ, పుష్పగుచ్ఛాలు అందుకుంటూ నేతలందరూ బిజీ బిజీగా గడిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఈ మేరకు పలు ఫోటోలను విడుదల చేసింది. తర్వాత ప్రపంచ నేతలందరూ కలిసి ఫ్యామిలీ ఫోటోకు ఫోజిచ్చారు. జి 20 సదస్సు సందర్భంగా విచ్చేసిన ఇతర నేతలతో మోదీ  విస్తృత అంశాలపై చర్చలు జరిపారు.