అక్రమ పాకిస్తానీ నివాసి ఇక్రమ్‌కు ఐదేళ్ల జైలు

దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌ పొంది, సైబర్‌ క్రైమ్‌కు పాల్పడి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కిన పాకిస్తాన్‌ జాతీయుడు మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ను నాంపల్లి కోర్టు దోషిగా తేల్చింది. ఇతడికి ఐదేళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. నకిలీ పత్రాలు సమకూర్చడం ద్వారా ఇతడికి సహకరించిన ముంబై వాసి నితీస్‌ కుమార్‌ మూలేకూ ఐదేళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. ఈ కేసును సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేష్‌ దర్యాప్తు చేశారు.

పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. ఆమె 13 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్‌ వెళ్ళారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈ మహిళకు పాకిస్తానీ మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు.

కొన్నాళ్ళకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్‌ తిరిగి వచ్చేశారు. 2011లో ఉస్మాన్‌ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్‌ వీసాపై వచ్చానంటూ చెప్పాడు. అయితే వాస్తవానికి అక్రమంగా దేశంలోకి ప్రవేశించాడు. దుబాయ్‌ నుంచి నేపాల్‌ వరకు విమానంలో వచ్చిన అతగాడు అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్ళి అట్నుంచి హైదరాబాద్‌ వచ్చాడు.
ఇక్రమ్‌ వచ్చిన ఆరు నెలలకు ఇతగాడు అక్రమంగా దేశంలోకి వచ్చాడన్న విషయం తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించింది. 
దీంతో కక్షకట్టిన అతగాడు ఆమె మైనర్‌ కుమార్తె  చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్‌ సందేశం పంపాడు. 
అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేష్‌ 2018 జూన్‌లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్‌ పేరుతో అనేక బోగస్‌ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్‌ పాస్‌పోర్ట్‌ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సరి్టఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది.  
ఇక్రమ్‌ పాక్‌ జాతీయుడని నిర్థారించడం కోసం పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా పాక్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ దేశ రాయబార కార్యాలయం అతడు తమ జాతీయుడే నంటూ ఇచ్చిన జవాబు సైతం ఎంఈఏ ద్వారా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చేరింది. దీన్ని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇక్రమ్‌పై ఐపీసీ, పోక్సో చట్టాలతో పాటు ఫారినర్స్‌ యాక్ట్, పాస్‌పోర్ట్‌ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద అభియోగపత్రాలు దాఖలు చేశారు.
నితీష్‌ పైనా సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఇద్దరికీ శుక్రవారం శిక్ష విధించింది.  అబ్బాస్‌ ఇక్రమ్‌ ఇప్పటికే మూడున్నరేళ్లు జైల్లో ఉన్నందున మరో ఏడాదిన్నర శిక్ష అనుభవించాల్సి ఉంది. ఆ తర్వాత ఇక్రమ్‌ను డిపోర్టేషన్‌ ప్రక్రియ ద్వారా పాకిస్తాన్‌కు పంపనున్నారు.