సమావేశాలు జరపని జీహెచ్‌ఎంసీ మేయర్ పై బిజెపి ఆగ్రహం

ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పడిన జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశాలను జరుపకుండా మేయర్ గద్వాల విజయలక్ష్మి కాలయాపన చేస్తుండడం పట్ల నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లలో అసహనం వ్యక్తం అవుతున్నది. అధికార పార్టీకి చెందిన వారు, వారికి మద్దతు ఇస్తున్న మజ్లీస్ కార్పొరేటర్లు ఈ విషయమై తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేయకపోతున్నారు.

అయితే అధికార పక్షంతో దాదాపుగా గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా పూర్తిస్థాయిలో ఒకసారి కూడా సమావేశం కాలేదు. చట్టంప్రకారం ప్రతి మూడు నెలలకో మారు సాధారణ సమావేశం నిర్వహించాలి. కానీ, ఇప్పటి వరకు ఒకే ఒక్క సమావేశం జరిగింది. అది కూడా వర్చువల్‌గా జరిగింది.

 బల్దియా అప్పులు రోజురోజుకి పెరుగుతుండటంతో  ఆస్తులను అమ్మేందుకు స్కెచ్ వేస్తున్న మేయర్ సమావేశాలను జరపడం లేదని బిజెపి కార్పొరేటర్లు అనుమానిస్తున్నారు.  ఎన్నో ఏండ్లుగా  కాపాడుకుంటూ వస్తున్న జీహెచ్ఎంసీ ఆస్తులను అమ్మితే ఊరుకోబోమని వారు హెచ్చరించారు.

 కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నోటీసు ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు మేయర్ రాకపోవడంతో  అక్కడే నిరసన వ్యక్తం చేశారు. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మేయర్ రాకపోవడమేంటని మండిపడ్డారు. 

సోమవారం మరోసారి ఆమెను కలిసే ప్రయత్నం చేస్తామని, ఆమె రాకపోతే మంగళవారం నుండి నిరసన ఆందోళన చేబడతామని ప్రకటించారు. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న జీహెచ్ఎంసీ అప్పుల్లోకి వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని గుడి మల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ధ్వజమెత్తారు.

ప్రస్తుతం వస్తోన్న ఆదాయం అప్పుల వడ్డీలు చెల్లించేందుకే సరిపోతుండటంతో జీహెచ్ఎంసీ ఆస్తులను అమ్మేందుకు స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గని పక్షంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 11న పాలకమండలి కొలువుదీరింది. అదేరోజు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికతోపాటు బడ్జెట్‌పై చర్చించి ఆమోదించారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని జూన్‌ 29న వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. తూతూమంత్రంగా సాగిన ఈ మీటింగ్‌లో ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు.

కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావడానికి,  వాటి పరిష్కారంకు  అవసరమైన ఆమోదాలు, హామీలు పొందడానికి ఈ సమావేశాలే కీలకం.  పైగా,  నగరంలో రూ.6కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి. ఆ తరువాతే ప్రభుత్వానికి పంపాలి.

నిబంధనల ప్రకారం సమావేశాలు జరగకపోవడంతో కీలక అభివృద్ధి పనులతోపాటు.. ప్రజా సమస్యల పరిష్కారంపైనా ప్రభావం పడుతోందని కార్పొరేటర్లు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్‌ చివరి వారం లేదా అక్టోబర్‌ మొదటి వారంలో సమావేశం జరగాల్సి ఉండగా నవంబర్ చివరి వరకు జరిగే సూచనలు కనిపించడం లేదు. 

అవినీతి, అక్రమాల బాగోతం బయటపడుతుందనే కౌన్సిల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. సమావేశ నిర్వహణ కోసం మేయర్‌కు వినతిపత్రం అందజేసేందుకు శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వారు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన వారు సాయంత్రం 4.30 గంటల వరకు వేచి చూసి మేయర్‌ రాకపోవడంతో అసహనంతో వెనుదిరిగారు. 

ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ‘నమ్మకంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. వారి సమస్యల పరిష్కారానికి ఏం చేయలేకపోతున్నాం. కార్పొరేటర్లకు బడ్జెట్‌ లేదు, మీటింగ్‌లు పెట్టరు. జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లో అధికారులు నిధులు లేవని చేతులెత్తేస్తున్నారు. ఇక మేమేం చేయాలి..?’ అని మండిపడ్డారు.