ఊరికో గ్రంథాలయం – ఇంటికో స్వచ్ఛాలయం నినాదం కావాలని, స్వచ్ఛ భారత్ వలే గ్రంథపఠనం ప్రజాఉద్యమ రూపు దాల్చాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. విజయవాడలోని చారిత్రక రామ్మోహన్ గ్రంథాలయాన్ని ఆదివారం నాడు ఆయన సందర్శించి భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తమ కుమార్తె శ్రీమతి దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ తరుఫున రూ 2.5 లక్షలు, కుమారుడు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రూ 2.5 లక్షల చొప్పున మొత్తం రూ 5 లక్షలను గ్రంథాలయ అభివృద్ధి కోసం విరాళంగా ప్రకటించారు. అనంతరం తమ మనోగతాన్ని ఫేస్ బుక్ వేదికగా ఉపరాష్ట్రపతి పంచుకున్నారు. చారిత్ర ప్రదేశాలను యువత సందర్శించిన స్ఫూర్తిని పొందాలని ఆయన ఆకాంక్షించారు.
అక్షరపు శక్తి గ్రంథమైతే, అనేక పుస్తకాల శక్తిని తనలో నింపుకున్న చైతన్య స్రవంతులు గ్రంథాలయాలన్న ఉపరాష్ట్రపతి, భారతీయ సంస్కృతిలో గ్రంథాలయాలు జాతి సంపదగా విరాజిల్లాయని తెలిపారు. భారత స్వరాజ్య సంగ్రామంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయన్న ఆయన, చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను రగిలించి, వికాసానికి నాంది పలికిన విషయాన్ని గుర్తు చేశారు.
దాదాపు 118 ఏళ్ళ చరిత్ర ఉన్న రామ్మోహన్ గ్రంథాలయ సందర్శన ఎంతో ఆనందాన్ని అందించిందన్న ఉపరాష్ట్రపతి, గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు ఈ సంస్థ కేంద్ర బిందువుగా నిలిచిందని గుర్తు చేశాపారు. గ్రంథాలయ అభివృద్ధిలో నాటి కార్యదర్శి అయ్యంకి వెంకటరమణయ్య కృషిని ప్రస్తావించిన ఆయన, ఎంతోమంది మహనీయులు చందాలు పోగేసి, అప్పు చేసి ఈ గ్రంథాలయ స్థలాన్ని కొన్న సంఘటన ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు.
ప్రజలను విజ్ఞానవంతులుగా మార్చి, చైతన్యం రగిలించేందుకు గ్రంథాలయ ఉద్యమం తోడ్పడిందన్న ఉపరాష్ట్రపతి, ప్రాచీన కాలం నుంచి మన జీవితంలో విప్లవాత్మక మార్పులకు పుస్తకాలు నాంది పలుకుతున్నాయని తెలిపారు. దేశాభివృద్ధికి, సాహిత్య జగతికి, విజ్ఞాన శాస్త్ర పురోగతికి, యుద్ధ సమయంలో, శాంతి సమయంలో, దేశ పునర్మిర్మాణ సమయంలో గ్రంథాలు సమస్త మానవాళికి అండగా నిలిచాయని గుర్తు చేశారు.
More Stories
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్
చైనాలో ఏపీ, తమిళనాడు ఎంబిబిఎస్ విద్యార్థులకు జైలు శిక్ష
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!