2024 నాటికి అన్ని మండలాలకు సంఘ్ కార్యం

2024 నాటికి దేశంలోని అన్ని మండలాలకు సంఘ్ కార్యకలాపాలను విస్తరింప చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నిర్ణయించింది 2025 సంవత్సరం సంఘ్ శతాబ్ది సంవత్సరం కావడంతో ఈ లోగా ఈ లక్ష్యం చేరుకొనేందుకు  కర్ణాటకలోని ధార్వాడ్ లో ముగిసిన మూడు రోజుల అఖిల భారత కార్యకారీ మండల్‌ (ఏబీకేఎం) సమావేశాలలో ఒక కార్యప్రణాళినకు రూపొందించారు.

 “సాధారణంగా, మేము ప్రతి మూడు సంవత్సరాలకు సంస్థను విస్తరించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాము. ఈ దృక్కోణంలో, మా పనిని మండల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాము” అని  ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే సమావేశాల అనంతరం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలోని 6,483 బ్లాకుల్లో 5,683 బ్లాకుల్లో సంఘ్ పని జరుగుతోంది. 32,687 మండలాల్లో పని ఉంది. రోజువారీ శాఖ 34 వేల చోట్ల, వారపు శాఖ 12,780 చోట్ల, నెలవారీ మిలన్ 7,900 చోట్ల, అంటే మొత్తం 55 వేల చోట్ల సంఘ్ ప్రత్యక్ష కార్యక్రమాలు  నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 54,382 రోజువారీ శాఖలు నడుస్తున్నాయని చెప్పారు. 910 జిల్లాల్లో సంఘ్ 900 జిల్లాల్లో పని చేస్తున్నది. 560 జిల్లా కేంద్రంలో 5 శాఖలు ఉన్నాయి.  84 జిల్లాలలోని అన్ని మండలాల్లో శాఖలు ఉన్నాయి.

సంఘ్ ప్రారంభమై 2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తవనున్న సందర్భంగా కనీసం 2 సంవత్సరాల పాటు పూర్తి సమయం ఇవ్వగలిగిన కార్యకర్తలకు పిలుపునిస్తున్నామని, 2022 నుంచి 2025 వరకు ఈ విధంగా పూర్తి సమయ కార్యకర్తలుగా పని చేయడానికి ఎంతమంది ముందుకు వస్తారో 2022 మార్చి నాటికి తెలుస్తుందని దత్తాత్రేయ తెలిపారు. 

ఆ విధంగా ప్రతి ఖండకు ఒక పూర్తి సమయ కార్యకర్త చొప్పున దేశంలో సుమారు 6 వేల మంది పూర్తి సమయ కార్యకర్తలు పని చేయనున్నారని ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా సాధారణ శాఖకు అంతరాయం ఏర్పడినప్పటికీ, సాధారణ సంపర్క్ ఆధారంగా, దేశంలోని 1,05,938 ప్రదేశాలలో గురు పూజను నిర్వహించిన్నట్లు ఆయన తెలిపారు.

కరోనా కారణంగా విద్య, ఉద్యోగాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ  స్వయం సేవకులు ప్రజల స్వావలంబన కోసం పని ప్రారంభించారని తెలిపారు. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, స్థానికులు ఉత్పత్తి చేసే వస్తువుల మార్కెటింగ్, బ్యాంకు రుణాలు తదితర రంగాల్లో స్వయంసేవకులు సహకరిస్తున్నారని, రాబోయే కాలంలో దీనిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.

పర్యావరణ పరిరక్షణ అనేది రోజువారీ జరగవలసిన కార్యక్రమమని అయితే కొన్ని హిందూ పండగలప్పుడు మాత్రమే కొందరికి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గుర్తుకురావడం సరికాదని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాలలో రాత్రికి రాత్రే మార్పు సాధ్యం కాదని, అకస్మాత్తుగా పండుగలను నిషేధించడం వలన వాటి మీద ఆధారపడ్డ అనేక మంది ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని, ఉపాధి కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. 

“మొత్తం అంశాన్ని సమగ్రంగా చూడాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోలేం. సమగ్రమైన, సమయానుకూలమైన చర్చ జరగాలి. ఈ పరిశ్రమలో నిమగ్నమై ఉన్న వ్యక్తులు, వారి ఉపాధి గురించి కూడా ఆలోచించాలి” అని సూచించారు.