వరిపై కేసీఆర్ వైఖరికి నిరసనగా సంజయ్ “రైతు దీక్ష”

`వరి వేస్తే ఉరే’ అంటున్న సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో  “రైతు దీక్ష” చేపట్టారు. కేంద్రం ధాన్యాన్ని కొనడం లేదంటూ సీఎం, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారం పై మండిపడ్డారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు.

సాయంత్రం 5 గంటల లోపు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కేంద్రం రాసిన లేఖను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు.లేనిపక్షంలో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా సీఎం లేఖ రాస్తే కేంద్రాన్ని ఒప్పిస్తామని, రైతు పండించిన ధాన్యాన్ని మొత్తం కనిపించే బాధ్యత తామే తీసుకుంటామని సంజయ్ స్ఫష్టం చేశారు. తాము ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తరువాత కూడా హుజూరాబాద్ ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సంజయ్ విమర్శించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన మంత్రులపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మంత్రిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

కోర్టులను దిక్కరించే వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ పై చట్ట, న్యాయపరమైన పోరాటం చేస్తామని సంజయ్ వెల్లడించారు. తెలంగాణలో పండిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేస్తోందని భరోసా ఇచ్చారు. అన్నీ కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?అంటూ ఎద్దేవా చేశారు. పండించిన ప్రతీ పంటను తామే కొంటామన్న కేసీఆర్ నోరు ఎందుకు విప్పడం లేదు? అని ప్రశ్నించారు.

వరి మీద కంటే కేసీఆర్ కు లిక్కర్ మీద ప్రేమ ఎక్కువ అంటూ  తెలంగాణలో “వరి బంద్” పథకాన్నీ అమలు చేయాలనుకుంటున్నారుని సంజయ్ ఆరోపించారు. వరి కాకుండా ఏ పంట పండించాలో ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వరి పంట వేయకుంటే లక్షల కోట్ల పెట్టి కాళేశ్వరం ప్రాజక్ట్ ఎందుకు కట్టినట్లు? అని నిలదీశారు.  వేల కోట్లు కమీషన్ దొబ్బుకుతున్నారని దుయ్యబట్టారు. రైతుబందు ఇచ్చి.. సీఎం కేసీఆర్ అన్నీ బంద్ చేస్తున్నాడని దుయ్యబట్టారు.

వడ్లు కొనేది కేంద్రమే.ధాన్యం కొనుగోలు చేసేది కేంద్రమే. ఈ విషయంలో సీఎం కేసీఆర్ మధ్యవర్తి (బ్రోకర్) మాత్రమే అని సంజయ్ స్పష్టం చేశారు. కమీషన్ల కోసం మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. వరి కొనబోము అని సీఎం, మంత్రులు ఎందుకు చెప్పుతున్నరు?… కేంద్రం మీకు ఎవరైనా ఫోన్ చేసి కొనబోము అని చెప్పారా? అని అని సంజయ్ నిలదీశారు. కేంద్రం ధాన్యాన్ని కొనడానికి సిద్ధంగా ఉందని పేర్కొంటూ కేసీఆర్ పిట్టల దొర మాటలు రైతులు ఎవరు నమ్మవద్దని ఆయన కోరారు.

తన దీక్ష ఆరంభం మాత్రమే అని పేర్కొంటూ రైతులను ఇబ్బంది పెడితే ఉద్యమిస్తాం. రేపటి నుండి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా ఆందోళనలు చేస్తామని, కేసీఆర్ మెడలు వంచుతామని సంజయ్ హెచ్చరించారు. 

సిద్దిపేట కలెక్టర్‌పై ఫిర్యాదు

కాగా, రైతులకు వరి విత్తనాలు విక్రయించవద్దని, దీనిని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా.. ఖాతరు చేయబోనంటూ సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకటరామారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర డీవోపీటీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. 

కలెక్టర్‌ ప్రకటన సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ఉల్లంఘనేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. కలెక్టర్‌ ప్రకటన కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కిందకే వస్తుందని, దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. 

కాగా, యాసంగిలో వరి సాగు చేయవద్దని మంత్రులు చెప్పడాన్ని నిరసిస్తూ గురువారం కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలను దహనం చేసి నిరసన తెలిపారు.  ఖమ్మంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్మల్‌ జిల్లా అబ్దుల్లాపూర్‌లో రైతులు ఆందోళన చేశారు.