ప్రతి తనిఖీలో గంజాయి మూలాలు ఏ.వో.బి. వైపే!

తాము గంజాయిపై నిర్వహించిన ప్రతి తనిఖీలో దాని మూలాలు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు (ఏ.వో.బి.) వైపు చూపించాయని నల్గొండ డీఐజీ ఏవి  రంగ‌నాథ్‌ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో పట్టుబడిన ప్రతి గంజాయి నేరస్థుడు విచారణ (ఇంటరాగేషన్) లో ఏ.వో.బి. ప్రాంతం నుండి ఎవరెవరు విక్రయిస్తున్నారు, ఎవరు వ్యాపారం చేస్తున్నారనే విషయాలను వారి పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించడం జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. 

ఏపీలోని ప్రతిపక్ష నేత ప్రోద్భలంతో తెలంగాణ పోలీసులు విశాఖ ప్రాంతంలో తనిఖీలకు వస్తున్నట్లు, తమ వల్లనే ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా అక్కడకు వస్తున్నట్లు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు గంజాయి ఆపరేషన్ విషయంలో చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగదం సరికాదని, తమ భుజాల మీద నుండి వారి రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరమని డీఐజీ రంగ‌నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తాము గంజాయి ఆపరేషన్, గంజాయి వ్యాపారం, రవాణా పై చేసిన ప్రకటనలను ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి కావాల్సిన విధంగా వారు అన్వయించుకుంటూ వారి రాజకీయ ప్రయోజనాల కోసం తమను వాడుకోవడం సరైన విధానం కాదని హితవు చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి బాధ్యత కలిగిన నేతలుగా గంజాయిని అన్ని స్థాయిలలో నిర్ములించడం, దేశ భవిష్యత్తును కాపాడడం, దేశంలోని యువత నిర్వీర్యం కాకుండా చూడడం కోసం పని చేయాలని ఆయన ఏపీ రాజకీయ నాయకులను కోరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా గంజాయి వ్యాపారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు ఉన్నా, రాజకీయ పార్టీల నాయకులు భాగస్వామ్యం అయినా అలాంటి వారిపై కఠినంగా, నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలని ఆదేశించడంతోనే తాము ఈ దాడులు జరుపుతున్నామని రంగనాథ్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలో గంజాయి స్మగ్లర్లు ఏ.వో.బి. లోనే కాదు కాశ్మీర్ లో ఉన్నా, దేశంలో ఎక్కడ ఉన్నా వారిని పట్టుకొని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి వారికి శిక్ష పడేలా పని చేస్తామని నల్లగొండ రంగనాధ్ స్పష్టం చేశారు. నల్లగొండ నుండి డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి ని ప్రత్యేక అధికారిగా ఏ.వో.బి. ప్రాంతానికి వెళ్లిన బృందాలను సమన్వయం చేయడానికి పంపించామని ఆయన తెలిపారు.

సతీష్ వైజాగ్ రూరల్ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో మూడు రోజుల పాటు (అక్టోబర్ 15 నుండి 17 వరకు) ఉండి విశాఖ రూరల్ ఎస్పీ ని సైతం కలిసారని,  ఈ మొత్తం ఆపరేషన్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి సహాయ, సహకారాలు అందించారని, నేరస్తులను పట్టుకోవడంలో అన్ని రకాలుగా సహకరించారని స్పష్టం చేశారు.

అదే విదంగా నల్లగొండ పోలీస్ బృందాలు ఏ.వో.బి.లోని తీవ్ర నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాలలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని ప్రాణాలకు తెగించి మెరుపు దాడులు చేయడంతో పాటు వారిని అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆక్రోబర్ 17వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబసింగి వద్ద తమ పోలీస్ బృందాలను గంజాయి ముఠాల నుండి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు చేశారని గుర్తు చేశారు.

ఈ ఆపరేషన్ లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాధ్ వివరించారు. ఇందుకు సంబంధించి తాము విచారణలో తెలుసుకున్న అంశాలను, ఏ.వో.బి. గంజాయి నెట్వర్క్ కు సంబందించిన పూర్తి సమాచారాన్ని అధికారిక పద్ధతిలో నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నివేదిస్తామని ఆయన వివరించారు.

నల్లగొండ పోలీస్ బృందాలు ఏ.వో.బి.తో పాటుగా గంజాయిని తరలిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్ (దూల్ పేట), ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, నారాయణపేటతో సహా పలు జిల్లాలలో దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విజయ దశమి రోజున నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలు ఆపరేషన్ గంజా ఇన్ ఏ.వో.బి ప్రారంభించాయని చెప్పారు.  ఇదే విషయాన్ని తాను స్వయంగా విశాఖ రురల్ ఎస్పీ కృష్ణారావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు లతో మాట్లాడడం జరిగిందని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, గురువారం జరిపిన ఏపీ  మంత్రివర్గ సమావేశంలో  గంజాయి ప్రస్తావన వచ్చిన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏవోబీలో గంజాయి మొక్కల పెంపకం తరతరాలుగా వస్తోందని.. ఈ రెండున్నరేళ్ల నుంచే మొదలు కాలేదని  సీఎం జగన్మోహన్‌రెడ్డి  స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాలను అడ్డుకుంటున్నామని, డీజీపీ సవాంగ్‌ త్వరలోనే విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాల డీజీపీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారని చెప్పారు.