కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

దీపావళి వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకుగాను కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సర్కార్‌ పంపిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి అనుమతి ఇస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. 

కేంద్రం అనుమతుల మేరకు కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎపిపిసిబి) అన్ని అనుమతులూ మంజూరు చేసిందని చైర్మన్‌ అశ్వినీ కుమార్‌ పరిడ తెలిపారు.

 3,591 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగనున్నది. ఏటా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతున్నది. దీని కోసం రూ.16,986 కోట్ల పెట్టుబడులు అవసరమని అంచనా వేశారు. ప్లాంటుకు అవసరమయ్యే నీటిని గండికోట రిజర్వాయరు నుంచి తీసుకుంతయారు.

కడప జిల్లా సున్నపు రాళ్లపల్లె, పెద్దనందులూరు గ్రామాల్లో స్టీల్‌ప్లాంట్‌ను ఏపీ హై గ్రేడ్‌ స్టిల్స్‌ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నది‌. తొలి దశలో ఏడాదికి 3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి, 84.7 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగనున్నది. 

మరోవైపు ప్రాజెక్ట్‌లో భాగంగా 33 శాతం.. 484.4 హెక్టార్లలో గ్రీన్‌బెల్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 జూన్ 10న కడప ఉక్కు పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.20 వేల కోట్లతో ఏర్పాటుచేయనున్నట్లు వైఎస్సార్‌ అప్పట్లో ప్రకటించారు.