కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స చేశారు. కానీ డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు. 
 
పునీత్ రాజ్ కుమార్ కు ప్రస్తుతం 46 ఏళ్లు. ఎంతో కెరీర్ ఉండి, ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌కుమార్‌ మరణవార్త గురించి తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు.

కర్ణాటక లెజండరీ నటుడు, కంఠీరవ రాజ్‌కుమార్‌, పార్వతమ్మ దంపతులకు 1975వ సంవత్సరం మార్చి 17వ తారీఖున మూడవ కుమారుడిగా జన్మించారు. తండ్రి వారసత్వంగా ఆయన సినిమాల్లోకి ప్రవేశించి,  బాలనటుడిగా పలు సినిమాల్లో నటించాడు. 1985వ సంవత్సరంలో బెట్టాడ హూవు అనే సినిమాలో బాలనటుడిగా మెప్పించినందుకుగానూ జాతీయ ఉత్తమ బాలనటుడు అవార్డుకు ఎంపికయ్యారు. 

అదే సమయంలో చాలీసువా మొదగాలు, ఏరాడు నక్షత్రగలు  u సినిమాలకు గానూ కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఉత్తమ బాలనటుడిగా ఎంపిక చేసింది. హీరోగానే కాకుండా గాయకుడిగా కూడా మెప్పించారు. 2002వ సంవత్సరంలో అప్పు సినిమాతో హీరోగా పునీత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతోనే పునీత్‌ను అప్పూ అని ఫ్యాన్స్ పిలిచుకోవడం ప్రారంభించారు. 

వీర కన్నడిగ, అజయ్, అరసు, రామ్, అంజనీపుత్ర వంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హీరోగా ఆయన 29 సినిమాల్లో నటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఆయన నటించిన యువరత్న సినిమా విడుదలయింది. 1999  డిసెంబర్ 1న అశ్వనీ రేవంత్ అనే ఆమెను పునీత్ రాజ్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. స్నేహితుల ద్వారా పరిచయమయిన ఆమెను ఇష్టపడి పెద్దల అంగీకారంతోనే ఆమెను పెళ్లాడారు. ఆ దంపతులకు ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

 పునీత్ భౌతిక‌కాయాన్ని విక్ర‌మ్ ఆస్ప‌త్రి నుంచి స‌దాశివ‌న‌గ‌ర్‌లోని ఆయ‌న ఇంటికి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో త‌మ అభిమాన హీరో కోసం అంబులెన్స్ వెనుక వేలాదిమంది అభిమానులు ఫాలో అయ్యారు. అభిమానుల ఆందోళ‌న దృష్ట్యా క‌ర్ణాటక ప్ర‌భుత్వం హై అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. అలాగే అభిమానుల సంద‌ర్శ‌నార్థం కంఠీర‌వ స్టేడియంలో ఆయ‌న భౌతిక‌కాయాన్ని ఉంచాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యం తెలిసి చివ‌రిచూపు కోసం అభిమానులు స్టేడియం వ‌ద్ద‌కు త‌ర‌లివ‌స్తున్నారు.

ఇక పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం ప‌ట్ల క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి బస‌వ‌రాజు బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అధికార లాంఛ‌నాల‌తో పునీత్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌ల‌ను త‌న తండ్రి క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ స‌మాధి వ‌ద్దే నిర్వ‌హించ‌నున్నారు.

పునీత్ రాజ్ కుమార్ ను చిత్రపరిశ్రమకు పరిచయం చేసింది మన తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ కావడం విశేషం. అప్పటికే బాలనటుడిగా దాదాపు 20 చిత్రాలకు పైగా నటించిన పునీత్ కోసం పురీ చెప్పిన కధ ఆయన తండ్రి రాజ్ కుమార్ కు నచ్చడంతో ఆ అవకాశం దొరికింది.  ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్.

అదే సినిమాను తెలుగులో తర్వాత ఇడియట్ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా. అప్పు తర్వాత అదే పేరుతో అభిమానులు పునీత్ ను పిలుచుకుంటున్నారు.  దివంగత రాజ్‌కుమార్‌‌తో సీనియర్ ఎన్టీఆర్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. వారిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందో.. అదే రీతిలో పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆత్మీయుల్లాగా ఉంటారు. అందుకే పునీత్ రాజ్ కుమార్ కోసం ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడారు.

ఎన్టీఆర్ పాటలను ఎంతో ఇష్టపడిన పునీత్ రాజ్ కుమార్ తన సినిమాలో ఓ పాటను పాడాలని స్వయంగా కోరారట. దీంతో ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు. చక్రవ్యూహ అనే యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ సినిమాలో గెలియా, గెలియా అనే పాటను ఎన్టీఆర్ పాడారు. సినిమాలో ఆ పాట అభిమానులను ఎంతగానో అలరించింది. సినిమా సూపర్ హిట్ అవడంలో ఆ పాట పాత్ర కూడా ఎంతో ఉంది.

పునీత్ రాజ్‌కుమార్ అకాల మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. చిన్న వ‌య‌సులోనే విధి ఆయ‌న‌ను మ‌న‌కు దూరం చేసింద‌ని, న‌టనా చాతుర్యం, అద్భుత‌మైన వ్య‌క్తిత్వంతో ఆక‌ట్టుకున్న పునీత్ రాజ్‌కుమార్‌ను రాబోయే త‌రాలు ఎన్న‌టికీ గుర్తుంచుకుంటాయ‌ని అన్నారు.పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌ధాని ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేశారు.