జిహాదీల కుట్రలో భాగమే బంగ్లా హిందువులపై హింసాకాండ

 
బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇటీవల జరిగిన హింసాకాండపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)  అఖిల భారతీయ కార్యకారి మండలి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది.  బంగ్లాదేశ్‌ను మరింత ఇస్లామీకరణ చేయడానికి జిహాదీ గ్రూపులు చేసిన పెద్ద కుట్రలో భాగమైన అక్కడి హిందూ మైనారిటీలపై కొనసాగుతున్న క్రూరత్వాన్ని కూడా కర్ణాటకలోని ధార్వాడ్ లో జరుగుతున్న సమావేశాలలో ఆమోదించిన ఒక తీర్మానంలో తీవ్రంగా ఖండించింది. తీర్మానం వివరాలను సంఘ్ సహా సర్ కార్యవాహ అరుణ్ కుమార్ మీడియాకు విడుదల చేశారు. 
 
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు, హిందూ దేవాలయాలపై హింసాత్మక దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్నట్లు పేర్కొంటూ, . పవిత్రమైన దుర్గాపూజ పండుగ సందర్భంగా చెలరేగిన మత హింసలో అనేక మంది అమాయక హిందువులు మరణించారని  విచారం వ్యక్తం చేసింది. వందలాది మంది గాయపడ్డారని, వేలాది కుటుంబాలను నిరాశ్రయులయ్యారని తెలిపింది. 
 
హిందూ సమాజానికి చెందిన అనేక మంది బాలికలు, మహిళలపై దాడి జరిగిందని తెలుపుతూ రెండు వారాల వ్యవధిలో దేవాలయాలు, దుర్గాపూజ మండపాలను ధ్వంసం చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  సమాజంలో మతపరమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టేలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన నిందితుల్లో కొందరిని అరెస్టు చేయడం వల్ల ఈ దాడులు రాడికల్ ఇస్లామిస్టుల పక్కా కుట్ర అని వెలుగులోకి వచ్చిందని గుర్తు చేసింది. 
 
భారత్‌ విభజన జరిగినప్పటి నుండి జనాభా బాగా క్షీణిస్తున్న హిందూ మైనారిటీలను నిర్మూలించడానికి,  తరచుగా, లక్ష్యంగా చేసుకున్న దాడులు స్పష్టంగా ఒక క్రమబద్ధమైన ప్రయత్నం అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ స్పష్టం చేసింది. విభజన సమయంలో తూర్పు బెంగాల్ జనాభాలో దాదాపు 28 శాతం మంది హిందువులు ఉండగా, ఇప్పుడు 8 శాతానికి తగ్గిపోయిందని గుర్తు చేసింది. 
 
జమాత్-ఎ-ఇస్లామీ (బంగ్లాదేశ్) వంటి రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపుల దురాగతాల ఫలితంగా విభజన తర్వాత, ప్రత్యేకంగా 1971 యుద్ధం సమయంలో హిందువులు పెద్ద ఎత్తున భారత్‌లోకి వలస వచ్చారని గుర్తు చేసింది. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందూ జనాభాలో అభద్రతాభావాన్ని సృష్టిస్తున్న మత సామరస్యాన్ని ఇప్పటికీ ఆ సంస్థలు నాశనం చేస్తూనే ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో మైనారిటీలపై పెరుగుతున్న హింసాత్మక సంఘటనలను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారి మండలి డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులు తమ హక్కులను పొందుతూ ,వారి సురక్షితమైన గౌరవప్రదమైన జీవితం గురించి హామీ ఇవ్వడానికి, హిందూ వ్యతిరేక హింసకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
 
మానవ హక్కుల నిఘా సంస్థలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అని పిలవబడే వారి చెవిటి నిశ్శబ్దాన్ని ఈ సందర్భంగా   ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండించింది. హింసను ఖండించడంలో అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని, బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, ఇతర మైనారిటీల  భద్రత కోసం తమ గొంతును వినిపించాలని  ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్‌లో లేదా ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో అయినా రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల పెరుగుదల ప్రజాస్వామ్యానికి,  ప్రపంచంలోని శాంతి-ప్రేమగల దేశాల ప్రజల మానవ హక్కులకు తీవ్రమైన ముప్పు అని కూడా  ఆర్‌ఎస్‌ఎస్‌ హెచ్చరించింది.
 
బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధుల భద్రత కోసం బంగ్లాదేశ్‌లో దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచ హిందూ సమాజం,  సంస్థల ఆందోళనలను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడానికి అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించాలని కార్యకారి మండలి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.

ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘ్, వి హెచ్ పి, ఇతర హిందూ సంస్థలు  ఇస్లామిస్ట్ హింసాకాండ బాధితుల పక్షాన నిలబడి, బంగ్లాదేశ్‌లోని హిందూ సోదరులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించినందుకు  ఆర్‌ఎస్‌ఎస్‌   కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో బంగ్లాదేశ్‌లోని హిందువులు,  హింసించబడుతున్న ఇతర మైనారిటీలకు మొత్తం హిందూ సమాజంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌  అండగా ఉంటుందని కూడా కార్యకారి మండలి హామీ ఇచ్చింది.