యుపిలో మాఫియాను నిర్ములించిన యోగి సర్కార్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ గణనీయమైన పురోగతిని సాధించిందని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో మాఫియాను నిర్మూలించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రశంసించారు. 
 
బీజేపీ సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని శుక్రవారంనాడు లక్నోలో ఆయన ప్రారంభిస్తూ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్లేందుకు తమకు మరో ఐదు సంవత్సరాలు అవసరమని చెప్పారు. 2024లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి 2022 యుపి ఎన్నికలు నాంది కావాలని ఆయన అభిలాష వ్యక్తం చేశారు.
”ఇది రాముడు, మహదవ్, కృష్ణుడు, కబీర్, బుద్ధుడు, సుహల్‌దేవ్, మదన్ మోహన్ మాలవీయ  పుట్టిన గడ్డ. ఇప్పుడు ఈ గడ్డ అభివృద్ధి బాట పట్టింది. అభివృద్ధి అనేది ఒక కుటుంబానికో, ఒక కులానికో పరిమితం కాకుండా అందరికీ చేరుతోంది. ముఖ్యంగా అత్యంత నిరుపేదల కోసం అభివృద్ధిని ఉద్దేశించాం” అని అమిత్‌షా పేర్కొన్నారు. 

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఐదేళ్లుగా ఇంటిపట్టే కూర్చుని, ఇప్పుడు కొత్త బట్టలు కుట్టించుకుని, అధికారంలోకి వస్తామంటూ కొందరు చెబుతున్నారని అంటూ విమర్శించారు.

“అఖిలేష్  బాబును నేను ఒకటే అడగదలచుకున్నాను. ఈ ఐదేళ్లలో ఆయన ఎన్ని రోజులు విదేశాల్లో గడిపారు? కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నారు?” అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యక్తులు తమ కుటుంబం కోసం, కులం కోసం ప్రభుత్వాలు నడిపారని, కనై  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అందరి కోసం పనిచేసింది” అని షా కొనియాడారు.

నాలుగు కోట్ల సభ్యత్వాలు లక్ష్యంగా చేపట్టిన ”మేరా పరివార్-బీజేపీ పరివార్” ప్రచారం ఈనెల 29 నుంచి డిసెంబర్ 31 వరకూ జరుగుతుందని, పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగించాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.

ప్రజలు, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. 2017లో ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం నెరవేర్చామని తెలిపారు. వచ్చే కొద్దీ నెలల్లో ఎన్నికల లోగా 100 శాతం పూర్తి చేసి, బీజేపీకి ఏదైతే చెబుతుందో అదే చేస్తుందని ప్రజలకు చూపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  ఎస్‌పీ, బీఎస్‌పీలు రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే, ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ అభివృద్ధిని పట్టాల మీదకు తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ప్రశంసించారు.