బిఎంఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ ఉద్యోగుల ధర్నా

భారతీయ మజ్దూర్ సంఘ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కేంద్ర పబ్లిక్, ప్రభుత్వ రంగ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్నదని ఆ సంఘం నాయకులు ద్వజమెత్తారు. 
 
దీనిని కేంద్ర జాతీయ కార్మిక సంఘం బి యం యస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వారు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా తెలంగాణ బియంయస్ హైదరాబాద్ లో నిర్వహించిన ధర్నాలో బియంయస్ జాతీయ ఉపాధ్యక్షుడు యస్.మల్లేశం మాట్లాడుతూ దేశంలో పిఎస్ యు ల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రక్షణ రంగంలో ప్రయివేట్ భాగస్వామ్యాన్ని బియంయస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని,  డిఫెన్స్ ఆర్డినెన్స్ రంగం కార్పొరేటీకరణ ఆపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పిఎస్‌యుల వ్యూహాత్మక అమ్మకం విరమించుకోవాలని ఆయన  తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆల్ ఇండియా ఇంచార్జ్ చెన్నకేశవరావు మాట్లాడుతూ బ్యాంకులు లాగా బీమా, పిఎస్ యుల  విలీనం ఆపాలని కేంద్రాన్ని కోరారు. బొగ్గు రంగం ప్రయివేటీ కరణ నిలిపి వేసి బొగ్గురంగంలో వస్తున్న లాభాలలో కొంత శాతం వాటాను కార్మికులకు పంచాలని కోరారు.
 
రాష్ట్ర బియంయస్ అధ్యక్షుడు బి.రవీంద్రరాజు వర్మ మాట్లాడుతూ  కార్మిక చట్టాలలో కార్మిక వ్యతిరేక మార్పులు నిలిపి వేసి కార్మికుల సంక్షేమానికి అనుకూలంగా చట్ట సవరణ చేయాలని కోరారు. బిఎస్ఎన్ఎలల్, ఎంటిఎన్ఎల్, ఐటిఐ తదితర సిపిఎస్ ఇలకు మూడవ పిఆర్ సి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందరికి ఇప్పటివరకు పెన్షన్ అందేలా చట్టాలను సవరించాలని కోరారు.  దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు బియంయస్ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.